కాంగ్రెస్ పార్టీవన్ని అబద్ధపు ప్రచారాలే
బీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే పటాన్‌చెరువు వరకు రైల్వే లైన్
ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, అభ్యర్థి గాలి అనిల్‌కుమార్
నారాయణఖేడ్, మే 5 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీవన్ని అబద్ధపు ప్రచారాలే తప్ప అభివృద్ది లేదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. జహీరాబాద్ పార్ల మెంట్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ కు మద్దతుగా ఆదివారం రాత్రి నారాయణఖేడ్‌లో రోడ్‌షో నిర్వహించారు. బసవేశ్వర చౌక్ నుండి రాజీవ్‌చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సురేశ్ షెట్కార్ ఖేడ్ అభివృద్దికి చేసిందేమీ లేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంతో జరిగిన అభివృద్ధిని తమ హయాంలోనే జరిగినట్లు మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ అనడం సిగ్గు చేటన్నారు.
161 నేషనల్ హైవే తాను అధికారంలో ఉన్నపుడు వేయించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ నాయకుల చేతుల నుండి దేవాలయాల భూములకు విముక్తిని కల్పించామన్నారు. ఖేడ్ అభివృద్ది బీఆర్‌ఎస్ గెలిచాకే జరిగిందన్నారు. మరోసారి తమ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌ను జహీరాబాద్ ఎంపీగా గెలిపించాలని కోరారు. గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ తనకు అవకాశం ఇస్తే బోధన్, నారాయణఖేడ్, పటాన్‌చెరువు వరకు రైల్వే లైన్ ఏర్పాటుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. బీబీపాటిల్ కాని సురేష్ శెట్కార్ కానీ నారాయణ ఖేడ్‌కు చేసిందేమీ లేదన్నారు. తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు బిక్షపతి, రవిందర్‌నాయక్, పరమేశ్, ప్రభాకర్, సత్యపాల్‌రెడ్డి, విఠల్‌రావు పాటిల్ తదితరులు పాల్గొన్నారు.




