రాహుల్ గాంధీపై పోలీసుల చర్యను ఖండిస్తూ.. కాంగ్రెస్ శాంతియుత నిరసన
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఆదం సంతోష్ కుమార్
సికింద్రాబాద్, జూలై 23 (విజయక్రాంతి): కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని ఆదం సంతోష్ కుమార్ అన్నారు.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసనకు సంఘీభావం తెలిపిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై పోలీసులు వ్యవహరించిన తీరును ఆదం సంతోష్ కుమార్ ఖండించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం సీతాఫల్మండి అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ విగ్రహం వరకు సాగిన ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రాహుల్ గాంధీ పై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. అనంతరం ఆదం సంతోష్ కుమార్ మాట్లాడుతూ నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలు దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయని అన్నారు.
పేపర్ లీకేజీలకు కారణమైన అసలు సూత్రధారులను గుర్తించి ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు.వైద్య విద్యలో ప్రవేశం కోసం విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి చదువు తున్నారని,తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ ఇప్పిస్తున్నారని తెలిపారు. రాత్రింబవళ్లు శ్రమించి పరీక్షలకు సిద్ధమవు తున్న విద్యార్థుల జీవితాలతో కొందరు అక్రమాలకు పాల్పడుతూ చెలగాట మాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పరీక్షలు పదేపదే రద్దు కావడంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, తల్లిదండ్రులు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై పోలీసులు బలప్రయోగం చేసి అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారిపై ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని,నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పారదర్శకమైన పరీక్షా వ్యవస్థను అమలు చేయాలని ఆదం సంతోష్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో రాజేందర్ యాదవ్,శిల్పాచారి,డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ.. కాంగ్రెస్ శాంతియుత నిరసన ర్యాలీ
ముఖ్యఅతిథిగా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్
మేడిపల్లి, జూలై 23 (విజయక్రాంతి): మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకుల అరెస్టులను ఖండిస్తూ వరంగల్ హైవే పై బోడుప్పల్ కమాన్ నుండి మేడిపల్లి వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్‌మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులపై అక్రమ అరెస్టులు, వేధింపులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
ప్రజల హక్కులు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ నిరసన ర్యాలీలో బోడుప్పల్, చెంగిచెర్ల, మేడిపల్లి, పిర్జాదిగూడ డివిజన్ల అధ్యక్షులు బొమ్మకు కళ్యణ్, పోగుల దిలీప్ రెడ్డి, బండి శ్రీరాములు గౌడ్, తుంగతుర్తి రవి, బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ యాదవ్, మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి,బోడుప్పల్ మాజీ అధ్యక్షులు పోగుల నర్సింహా రెడ్డి,కొత్త కిషోర్ గౌడ్,ప్రభాకర్ రెడ్డి, డీసీసీ సెక్రెటరీ ఏనుగు జలంధర్ రెడ్డి,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మకు అజయ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర రాహుల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి : బాబా ఫసీయుద్దీన్
జూబ్లీహిల్స్, జూలై 23 (విజయక్రాంతి): నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనకు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించాలి.వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బోరబండ డివిజన్ మాజీ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం బోరబండలో నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టు, జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని ఖండిస్తూ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా బాబా ఫసీయుద్దీన్ మాట్లాడుతూ విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందన్నారు.శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులతో పాటు వారికి మద్ధతు తెలిపిన వారి పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే పదవికి రాజీనామా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బోరబండ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆనంద్, నాయకులు మహేశ్ కాసుల, రమేశ్ నాయక్, కవిత, లక్ష్మి నాయక్, వైజయంతి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ చెలగాటం : ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నేతల ఆరోపణ
విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని విద్యార్థి నేతలు ఆరోపించారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో దిల్లీలో విద్యార్థుల నిరసనను పోలీసుల అణచివేయడాన్ని వారు ఖండించారు. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ జూబ్లీహిల్స్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ హైదరాబాద్ సెంట్రల్ సిటీ నాయకులు సునీల్, లెనిన్ మాట్లాడుతూ నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాలకు కేంద్ర విద్యా శాఖ మంత్రి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీజేపీ ఆధ్వర్యంలో దిల్లీలో నిర్వహించిన చలో పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. నీట్ పరీక్షల నిర్వహణ బాధ్యతలను రాష్ట్రాల ఆధ్వర్యంలో నిర్వహించేలా విధానాలను రూపకల్పన చేయాలని కోరారు. పారదర్శకంగా పరీక్షలను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాపర్తి అశోక్, సోమేశ్, ఆసిఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు మనోజ్, కైలాశ్, చందు, జగదీష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి..
నీట్ ఎగ్జామ్ లో జరిగిన లీకేజీలు,అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఎర్రగడ్డ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ నయీమ్ ఉద్దీన్ డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గురువారం ఏజీ కాలనీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు రవిగౌడ్,రూపేష్,సలామ్, గౌస్ సంధాని,శ్రీనివాస్, యాదగిరి,సురేష్ గౌడ్,అక్బర్,మునీర్ లు పాల్గొని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు.దిల్లీలో జరిగిన చలో పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, యువకులపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.






