15 August, 2026 | 4:54 AM

ఖర్గే అవమానంపై కాంగ్రెస్ సత్యాగ్రహం

15-08-2026 12:00 AM

వనపర్తి, ఆగస్టు 14 (విజయక్రాంతి) :  కులం, మతం, ప్రాంతం ఆధారంగా ప్రజలను విభజించకుండా అన్ని వర్గాల సమూహమే భారతదేశమని డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి అన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అవమానించేలా బీజేపీ నాయకులు వ్యవహరించడాన్ని నిరసిస్తూ టీపీసీసీ పిలుపు మేరకు శుక్రవారం వనపర్తిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ సత్యాగ్రహ ర్యాలీ నిర్వహించారు.

జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ.. హల్ద్వానీలో కాంగ్రెస్ ర్యాలీ జరిగిన ప్రదేశాన్ని గంగాజలంతో శుద్ధీకరణ చేయడం అత్యంత అభ్యంతరకరమన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం ప్రజాస్వామ్యానికి పునాదులని పేర్కొన్నారు. రైతులు, విద్యార్థులు తమ హక్కుల కోసం గళం విప్పుతున్న సమయంలో బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందని, ఖర్గేకు పార్టీ తరఫున సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. రాముడి పేరు, అక్షింతల పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ దళితులను అవమానిస్తే ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ అన్ని మతాలను, అన్ని వర్గాలను గౌరవిస్తూ ముందుకు సాగుతుందని అన్నారు.

ఖర్గేకు జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, ప్రధాన కార్యదర్శి బ్రహ్మం, అధికార ప్రతినిధి వెంకటేష్, ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా అధ్యక్షుడు రాజ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.