27-11-2025 12:28:24 AM
ముషీరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా మోసం చేసిన కాంగ్రెస్ భరతం పడతామని జాతీయ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. భేషరతుగా జీవో 46ను ఉపసంహరించుకుని, 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. కోర్టులో వాదనలు పూర్తికాకముందే, జీవో 9ను రద్దు చేయకుండానే మరో జీవో విడుదల చేయ డం, ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడం న్యాయసూత్రాలకు విరుద్ధమని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఉద్యమ కార్యాచరణలో భాగంగా నగరంలోని విద్యానగర్ బీసీ భవన్‌లో బుధవారం ఆర్ కృష్ణయ్య ఒక రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. రాజ్యాంగబద్ధంగా జీవో 9 జారీ చేసిందన్నారు.
బీహార్ ఎన్నికలు ముగియగానే చడి చప్పుడు కాకుండా రిజర్వేషన్లను 42 శాతం నుంచి 22 శాతం తగ్గిస్తూ జీవో 46 జారీ చేయడం దారుణం అన్నా రు. అమలు చేయడంలో 17 శాతం తగ్గించి తీవ్ర అవక-తవకలు పాల్పడ్డారన్నారు. జీవో 46 కారణంగా సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల కేటాయింపులో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఈ మోసాన్ని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా శాం తియుతంగా ఉద్యమాలు, ధర్నాలు, మౌన దీక్షలు, మంత్రులు, ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీసుల వద్ద దీక్షలు నిర్వహించాలని, ఈ నెల 29న రహదారుల దిగ్భంధం చేపట్టాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు.
మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న బీసీ వ్యతిరేక చర్యను ఖండించారు. రిజర్వేషన్లు సాధించేంతవరకు విశ్రాం తి తీసుకోమని, బీఆర్‌ఎస్ పార్టీ బీసీ ఉద్యమానికి కృష్ణయ్యకు పూర్తి మద్దతు ఇస్తుం దని వెల్లడించారు. ప్రతి దశలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదని తేట తెల్లు అవుతుందన్నారు.
బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహనరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటే మోసం అనేది ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చా క రెండేళ్లు డ్రామా నడిపి, ఇప్పుడు ఇవ్వలేమని చేతులు ఎత్తివేయడం దుర్మార్గమని విమర్శించారు. సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. రేవంత్ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తి కి విరుద్ధమని తెలిపారు.
బీసీ యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ పాలూరు రామకృష్ణయ్య, రాష్ట్ర బీజేపీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కో-ఆర్డినేటర్ డాక్టర్ ర్యాగ రిషి అరుణ్ కుమార్‌లు ప్రసంగించారు. దీక్షకు మద్దతుగా వందలాది మంది కార్యకర్తలు, 40 కుల సంఘాలు, 36 బీసీ సంఘాల నాయకులూ పాల్గొని మద్దతు ప్రకటించారు.
ఈ దీక్షా కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ సత్యం, నీల వెంకటేష్ ముదిరాజ్, జి. అనంతయ్య, టి. రాజ్ కుమార్ గొరిగే మల్లేష్ యాదవ్, జిల్లపల్లి అంజి, మోడీ రాందేవ్, భూమన్న యాదవ్, అనురాధ గౌడ్, సీ. రాజేందర్, బాణాల అజయ్, ఎం. పృథ్వి గౌడ్, జి. పద్మ, శివ యాదవ్, భీం రాజ్, అరవింద్ స్వామి, కిషోర్ యాదవ్, రాజు గౌడ్, బాలయ్య, ప్రీతం పాల్గొన్నారు.