27-11-2025 10:13:31 AM
వీరనారి మరణానికి సాక్ష్యం చందుపట్ల శాసనం
నేటికీ నెరవేరని హామీల నిదర్శనం
నకిరేకల్,(విజయక్రాంతి): కాకతీయ సామ్రాజ్యపు పరాక్రమ గాథలో సువర్ణ అక్షరాలుగా నిలిచిన రాణి రుద్రమదేవి(Rudrama Devi )… ఆమె చివరి క్షణాలకు సాక్ష్యం నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామం. 13వ శతాబ్దం నవంబర్ 27న జరిగిన చారిత్రక యుద్ధంలో రుద్రమదేవి వీరమరణం, ఆమె సేనాధిపతి మల్లికార్జున నాయకుడి త్యాగం. వీటన్నింటికీ సాక్ష్యంగా నిలిచిన శిలాశాసనం ఈ గ్రామానికి అమరత్వం తెచ్చింది కానీ చరిత్ర చెప్పే నేలపై ఏర్పాటుచేసిన రుద్రమదేవి విగ్రహo మాత్రం గౌరవానికి కరువై దశాబ్దంగా ఎదురు చూస్తోంది.
చరిత్రలో చందుపట్ల శాసనం
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో పెద్దముత్యాలమ్మ గుడి పక్కన సగం పూడుకుపోయిన రాతి శాసనాన్ని స్థానిక యువత, చరిత్రకారుల కృషితో వెలికితీయడం చందుపట్ల చరిత్రలో నిలిచింది.
శాసనం చెబుతున్న వాస్తవాలు
రుద్రమదేవి (రాయగజకేసరి బిరుదం), ఆమె సేనాధిపతి మల్లికార్జున నాయకుడు చందుపట్ల ప్రాంతంలోనే వీరమరణం పొందారు. పువ్వుల ముమ్మడి ప్రతిష్ఠించిన ఈ శాసనం సోమనాధ దేవాలయానికి దానాలు, యుద్ధ వివరాలను స్పష్టంగాలిఖించింది. 1957లో వెలుగులోకి వచ్చిన ఈ శాసనాన్ని 1987లో చరిత్రకారుడు పరబ్రహ్మశాస్త్రి నిర్ధారించగా, 2003 నవంబర్ 27న గద్దెపై ప్రతిష్ఠించారు. చందుపట్ల శాసనం విశిష్టతను గుర్తించిన విద్యా మండళ్లు-యూనివర్సిటీ, ఇంటర్, 7వ తరగతి పాఠ్యాంశాల్లో దీన్ని చేర్చడం ఈ గ్రామం చరిత్రకు దక్కిన అరుదైన గౌరవం.
ఆవిష్కరణ లేకే దశాబ్దం గడిచిన రుద్రమ విగ్రహం
చందుపట్ల గ్రామ స్టేజి వద్ద దాతల సహకారంతో ప్రతిష్ఠించిన రుద్రమదేవి కాంస్య విగ్రహం దశాబ్దం గడిచినా ఇప్పటికీ అధికారిక ఆవిష్కరణకు నోచుకోలేదు.2012 ఆగస్టులో నాటి కలెక్టర్ ఎన్.ముక్తేశ్వరరావు శిలాశాసనాన్ని పరిశీలించేందుకు రావడంతో, యువజన మండలి ప్రతినిధులు శాసన పరిస్థితి, గ్రామ చరిత్ర వివరాలు తెలియజేశారు. రుద్రమదేవి ఈ ప్రాంతంలోనే వీరమరణం పొందినందున పర్యాటకంగా అభివృద్ధి సాద్యమని, విగ్రహం అవసరాన్ని వివరించారు.కలెక్టర్ సూచనలతో నల్లగొండ ఎస్‌బిహెచ్ అధికారులు రూ.6.50 లక్షల వ్యయంతో 10 అడుగుల ఎత్తు, 7 క్వింటాళ్ల బరువుతో కాంస్య విగ్రహాన్ని తయారు చేశారు. రూ.2.50 లక్షలతో ప్రతిష్టా దిమ్మెను నిర్మించి 2015లో విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే ఆ సమయంలో వేసిన ముసుగు గాలికి ఊడిపోవడంతో పరోక్షంగా ఆవిష్కరణ జరిగినా, ప్రభుత్వ స్థాయి అధికారిక ఆవిష్కరణ మాత్రం నేటివరకు జరగలేదు. పాలకులు పట్టించుకోవడంలేదని దీని మీద అనేక విమర్శలు వెలువత్తుతున్నాయి. చరిత్ర ను అవమానించేలాగా ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు.
అమలు కాని కేసీఆర్ హామీలు
2015 ఏప్రిల్ 26న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రామసముద్రం పూడిక పనుల సందర్భంగా చందుపట్లను సందర్శించారు. గ్రామ చరిత్ర, రుద్రమ మరణ శిలాశాసనాన్ని పరిశీలించిన అనంతరం ప్రతి సంవత్సరం కాకతీయ ఉత్సవాలు నిర్వహిస్తామని, గ్రామ ముఖద్వారంలో కాకతీయ ఆర్చ్ ఏర్పాటు చేస్తామని,చందుపట్లను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కానీ ఈ హామీల్లో ఒక్కటీ నేటివరకు అమలు కాలేదు.2022 జూలై 12న నాటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గ్రామాన్ని సందర్శించి, విగ్రహం పక్కన ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చందుపట్లను పర్యాటక స్మారక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచించినప్పటికీ, ఏ చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. వీరవనిత రాణి రుద్రమదేవిని చరిత్రను పట్టించుకోకపోవడం చరిత్రను అవమానించినట్లేనని సాహితి వేత్తలు మేధావులు ప్రముఖులు ప్రజలు ఆరోపిస్తున్నారు.
పాలకుల నిర్లక్ష్యం... విగ్రహానికి అవమానం
రుద్రమదేవి వీరమరణానికి సాక్ష్యంగా నిలిచిన చందుపట్ల గ్రామంలో ఆమె చరిత్రకు అవమానం జరుగుతుంది. శాసనాలను గుర్తించినా పట్టించుకోని పాలకులు, 2015లో నాటి సీఎం ఇచ్చిన ‘పర్యాటక అభివృద్ధి’ హామీలు కూడా నెరవేరలేదు.గత పాలకుల నుండి నేటి వరకు కొనసాగుతున్న నిర్లక్ష్యం వల్ల 2015లో ప్రతిష్టించిన రుద్రమదేవి కాంస్య విగ్రహం దశాబ్దంగా ఆవిష్కరణకు నోచుకోలేదు. చారిత్రక వారసత్వం పట్ల పాలకుల నిర్లక్ష్యవైఖరి చరిత్రకు అవమాన మన్న విమర్శలు ఉన్నాయి.
రాణి రుద్రమదేవి వేడుకలను ప్రభుత్వమే నిర్వహించాలి
రాణి రుద్రమదేవి వర్ధంతిని ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగానిర్వహించాలని .చందుపట్లను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి.కాంస్య విగ్రహానికి తక్షణ ఆవిష్కరణ చేయాలిని. చరిత్ర పుటల్లో నిలిచే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని. చరిత్రపై పాలకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.