18 August, 2026 | 1:17 AM

గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తాం

18-08-2026 12:00 AM
  1. తెలంగాణలో బోగస్ ఓట్ల పేరుతో 73 లక్షల తొలగింపు
  2. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
  3. కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్

ఉట్నూర్, ఆగస్టు 17 : గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీనీ బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ అన్నారు. సోమవారం ఉట్నూరులో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజక వర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో పీఏసీ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే కాంగ్రెస్ శ్రేణులకు నామినేట్ పదవులు అందుతాయని గుర్తు చేశారు.

కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవల చేపట్టిన సర్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో 73 లక్షల బోగస్ ఓట్లని గుర్తించి తొలగించామని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని గుర్తు చేశారు. సర్ కార్యక్రమంలో ఎక్కువ శాతం దళితులు, ఎస్టీలు, బీసీల ఓట్లను తొలగించారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పది నియోజకవర్గాలలో  కాంగ్రెస్ విజయ డంక మోగించాలని సూచనలు చేశారు.

జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను తప్పకుండా గుర్తిస్తామని అన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేస్తూ  ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించవలసిన బాధ్యత  కాంగ్రెస్ శ్రేణులపై ఉందని గుర్తు చేశారు.

ఈ సమావేశంలో పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, గడ్డం వినోద్, మాజీ ఎంపీ  సోయం బాపూరావు, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల్, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్, ఆత్రం సుగుణలతో పాటు ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.