రాజ్యాంగానికి బీజేపీతో ప్రమాదం
ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో పనిచేస్తోంది
భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలి
బీఆర్‌ఎస్ వేలకోట్లు అక్రమంగా సంపాదించింది
కాంగ్రెస్ నేత మధుయాష్కీగౌడ్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (విజయక్రాంతి): భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ఆరోపించారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సురవర ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో ‘మీట్ ది ప్రెస్’ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగమంటే రాజకీయ నాయకులు, మేధావులు, పాత్రికేయులకు మాత్రమే కాకుండా భారత పౌరులందరికీ సంబంధించిన అంశమన్నారు. రాజ్యాంగాన్నే మార్చా లనే దుర్మార్గపు ఆలోచనతో కేంద్ర ప్రభు త్వం, ప్రధాని నరేంద్రమోదీ ఆలోచిస్తున్నారన్నారు.
1928లో ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పడినప్పటి నుంచి కూడా స్వాతంత్య్రాన్ని వ్యతిరేకించిందని చెప్పారు. స్వాతంత్య్రం తర్వాత సమాన హక్కులను వ్యతిరేకించారని తెలిపారు. కుల వ్యవస్థను పెంపొందించారని అన్నారు. కాంగ్రెస్ కోసమో, ప్రతిపక్షాల కోసమో కాకుండా భావితరాల భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకోవాలన్నారు. మే 13న పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తును మార్చే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. పార్లమెంట్ ఎన్నికలను ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలన్నారు. తెలంగాణలో మార్పు మొదలైందన్నారు. జరిగిన రెండు దశల ఎన్నికల్లో ఇండియా కూటమిదే అధికారమని స్పష్టమైందన్నారు.
పేద రాష్ట్రంగా మార్చారు..
రాష్ట్ర విభజన తర్వాత మిగులు ఆదా యం ఉందని, అప్పుడే హైదరాబాద్ ఆదాయాన్ని విభజించవద్దని ప్రత్యేకంగా పోరా టం చేశానని మధుయాష్కీ గుర్తుచేశారు. ప్రస్తుతం 7లక్షల కోట్లపైన అప్పుల్లో ఉంచారని చెప్పారు. కేంద్రంలో 55 లక్షల కోట్లు ఉన్న అప్పునీ బీజేపీ సర్కార్ 1.87 లక్షల కోట్లకు పెంచిందన్నారు. 90 శాతం పెరుగుతున్న ఆదాయం పారిశ్రామికవేత్తలకు పోతుందన్నారు. అంబానీ, అదానీ, వ్యాక్సిన్ కంపెనీలకు ఈ బీజేపీ ప్రభుత్వం పేదల సొమ్మును దోచిపెడుతున్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు, నీళ్లు, నిధులు వస్తాయని.. అందుకే అనేక మంది తమ ప్రాణాలను బలితీసుకున్నారని గుర్తు చేశారు.
మరొకరి ప్రాణం కూడా పోవద్దని చెప్పి తల్లిగా సోనియాగాంధీ రాత్రికి రాత్రే ప్రత్యేక రాష్ట్ర ఏర్పా టు ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణలో పాత్రికేయుల పాత్ర చాల కీలమన్నారు. పదేండ్ల పాలనలో ఆస్పత్రి, కళాశాలలను ఏర్పాటు చేయలేదన్నారు. నాలుగు వేలకు పైగా సర్కార్ బడులు, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు మూతపడ్డాయన్నారు. ప్రస్తుతం ఉస్మానియా వర్సిటీ సైతం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. హైదరాబాద్ చుట్టూరా ఉన్న ప్రభుత్వ భూములను తక్కు వ ధరకు తమ బంధువులు, స్నేహితులకు విక్రయించారని ఆరోపించారు.




