భద్రాద్రి జిల్లాలో గాలివాన బీభత్సం
పిడుగుపాటుకు రైతు మృతి
గాలికి లేచిపోయిన రేకులు
భద్రాద్రి కొత్తగూడెం, మే 3 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్ర వారం గాలివాన బీభత్సం సృష్టించింది. పలు మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయి రైతలకు నష్టం వాటిల్లింది. ములకలపల్లి మండలంలో కురిసిన వర్షానికి దాన్యం తడిసిముద్దయ్యింది. రోడ్లపై చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మం డలంలోని పుసూగూడెం పంచాయతీ పరిధిలోని ఓడ్డు రామవరం గ్రామంలో పిడుగుపడి బోడ శివరాం (40) అనే రైతు అక్కడి కక్కడే మృతి చెందగా, మరో రైతు గుగులోత్ శ్రీను తీవ్రంగా గాయపడ్డాడు. వారిద్దరు ఆరబెట్టిన ధాన్యం కుప్పపోసేందుకు వెళ్తున్న క్రమంలో పిడుగుపడింది. మృతుడికి భార్య అనిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు.




