28 March, 2026 | 4:56 AM

వెనకకు జరిగేదేలే!

04-05-2024 01:32 AM

సెట్‌బ్యాక్‌కు ఇష్టపడని ఇంటి యజమానులు

మహబూబ్‌నగర్‌లో రోడ్ల అభివృద్ధికి అడ్డంకులు

నూతన నిర్మాణాలపై కరువైన మున్సిపల్ పర్యవేక్షణ

భవిష్యత్‌ను విస్మరించి కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణాలు

టౌన్‌ప్లానింగ్‌లో ఔట్ సోర్సింగ్ సిబ్బంది అండదండలు

మహబూబ్‌నగర్, మే 3 (విజయక్రాంతి) : రోడ్లు పెద్దగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ, ఆ రోడ్డు కోసం కొంత స్థలం వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. అవసరమైతే రోడ్డు స్థలాన్ని కొంత కలుపుకుందామనే చూస్తుంటారు. అలాంటి పరిస్థితులే  ఇప్పుడు మహబూబ్‌నగర్ పట్టణంలో కనిపిస్తున్నాయి. భవిష్యత్ కాలాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నగరంలో నిర్మాణాలు సాగుతుండడమే ఆందోళనకు దారి తీస్తోంది. పల్లెలు, పట్టణం.. ప్రాంతం ఏదైనా ఇంటి నిర్మాణం చేపట్టాలంటే... భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగా రోడ్డు వెంటడి కొంత వెనకకు (సెట్‌బ్యాక్) జరిగి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే మహబూబ్‌నగర్‌లో అలాంటి నిబంధనలు ఏవీ పట్టించుకోకుండానే కట్టడాలు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇందుకు కొందరు మున్సిపల్ అధికారుల నిర్వాకం  గృహ యజమానులకు కలిసి వస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఇండ్ల నిర్మాణాల్లో అంతులేని అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్న ట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.   

నిబంధనలు తూచ్..

రోడ్డు వెంబడి నిర్మాణాలకు తప్పనిసరిగా మున్సిపల్ నిబంధనలకు ప్రకారం సెట్‌బ్యాక్ కావాల్సి ఉంటుంది. వాటినే పట్టించుకోని మహబూబ్‌నగర్ ప్రజలు కొందరు ఏకంగా డ్రెయినేజీలను సైతం వదిలిపెట్టడం లేదనే వాదనలు ఉన్నాయి. మురికి కాలువలపై ఏకంగా కట్టడాలు చేపట్టినట్లు పలువురు చెప్తున్నారు. గత ఏడాది వర్షాకాలంలోనే డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేక ఇళ్లలోకి వరద నీరు చేరి ఇబ్బం దులు ఎదుర్కొన్నారు. అవేమీ పట్టించుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. 

ఎప్పటికైనా ముప్పే..!

సెట్‌బ్యాక్ లేకుండా చేపట్టే ఇళ్ల నిర్మాణాలకు ఎప్పటికైనా ముప్పు తప్పదనే వాదనలు లేకపోలేదు. అధికారులు అండగా ఉన్నారనే బలమో, చేతినిండా ధనం ఉందనో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడితే..  భవిష్యత్‌లో ఆ అధికారులే ఉన్నతా ధికారుల ఆదేశాలకు అనుగుణంగా కూల్చివేయడానికి వెనుకాడరని పలువురు పేర్కొం టున్నారు. అవగాహన కల్పించాల్సినే అధికారులే.. చేతివాటానికి వెళ్లి.. ప్రజలను నష్టాలపాలు చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

45వేలకు పైగా గృహాలు..

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో 45వేలకు పైగా ఇండ్లు ఉన్నాయి. వందలాది ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. నిర్మించిన ఇండ్ల విషయాన్ని పక్కన పెడితే నిర్మిస్తున్న ఇళ్ల విషయంలోనే అధిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉండడంతో అధికారులు అంతా ఎన్నికల విధులలో నిమగ్నమయ్యారు. ఈ తరుణం బాగుందని భావి స్తున్న  ఇళ్ల నిర్మాణదారులు సెట్‌బ్యాక్ తీసుకోవాల్సి ఉన్నా కూడా పట్టించుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. 

సెట్‌బ్యాక్‌పై టౌన్ ప్లానింగ్ నజర్ ఎక్కడ. ? 

టౌన్ ప్లానింగ్ అధికారుల నజర్ ఎక్కడ ఉందో ?  సెట్‌బ్యాక్ అనేది చాలా ప్రాధాన్యత గల అంశం. భవిష్యత్తు తరాలకు మంచి నగరంను తయారు చేసే బాధ్యతలో ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సెట్‌బ్యాక్ పద్ధతిలో నిర్మాణాలు జగడం లేదు. ఇప్పటికైనా టౌన్‌ప్లానింగ్ అధికారులు అవసరమైన నిఘా ఉంచి సెట్ బ్యాక్ విధానంలో ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణం చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

అధికారుల కనుసన్నల్లోనే...

నగరంలో ఇళ్ల నిర్మాణాలు మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారుల కను సన్నల్లోనే జరుగుతున్నట్లు నగరవాసుల్లో చర్చ జరుగుతోంది. సెట్‌బ్యాక్ లేకుండా చేపడుతున్న నిర్మాణాల వద్దకే అధికారులు నేరుగా వెళ్లి.. ఆమ్యామ్యాలు వసూలు చేసుకుని, నిబంధ నలను గాలికి వదిలేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు, ఇటీవల మొదలుపెట్టిన నిర్మాణాలను ఎన్నికల కోడ్ ముగిసేలోపు పూర్తి చేసుకోవాలని ఉచిత సలహా కూడా ఇస్తు న్నట్లు ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.