13 August, 2026 | 1:52 AM

ఆగమ శాస్త్ర ప్రకారమే నిర్మాణం

13-08-2026 12:00 AM
  1. శృంగేరి మార్గదర్శనంలో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు 
  2. గర్భాలయం, మహామండపానికి ఎలాంటి మార్పులు లేవు 
  3. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు 
  4. వేములవాడ అభివృద్ధి పనులపై శృంగేరి శారదా పీఠాధిపతి భేటీ 
  5. హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఈవో రమాదేవి, ప్రధాన అర్చకులు

వేములవాడ, ఆగస్టు 12: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులు పూర్తిగా ఆగమ శాస్త్ర నిబంధనలు, సంప్రదాయాలకు అనుగుణంగానే కొనసాగుతున్నాయని దేవాదాయ శాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు స్పష్టం చేశారు.

వేములవాడ దేవస్థాన అభివృద్ధి పనులకు సంబంధించి మార్గదర్శకత్వం పొందేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఆలయ ఈవో ఎల్. రమాదేవి, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ శ్రీనివాసరావు, ధార్మిక సలహాదారు గోవిందహరి, ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు బుధవారం కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో శారదా పీఠాధిపతి విధుశేఖర భారతి స్వామివారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ విధానాలు, ఆగమ నిబంధనలు, అభివృద్ధి పనుల పురోగతిపై పీఠాధిపతితో దాదాపు గంటన్నర పాటు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కమిషనర్ హనుమంతరావు శృంగేరి నుంచి వీడియో సందేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం, వేములవాడ దేవస్థానం తరఫున ఇప్పటికే పలుమార్లు శృంగేరి పీఠాధిపతులను కలిసి వారి సూచనలు, మార్గదర్శకత్వం మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు.

రాజన్న ఆలయ అభివృద్ధిలో రాతి శిల్పకళా శైలి, ఆగమ నిబంధనలను పక్కాగా పాటిస్తున్నామని కమిషనర్ స్పష్టం చేశారు. స్వామివారి గర్భాలయాన్ని తాకడం కానీ, దాని వైశాల్యంలో మార్పులు చేయడం కానీ జరగడం లేదని తెలిపారు. అలాగే మహామండపానికి కూడా ఎలాంటి మార్పులు చేపట్టడం లేదని వెల్లడించారు.

శిఖర భాగాన్ని తిరిగి సంపూర్ణ శిలామయ రూపంలో, భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని శిఖరం ఎత్తును మరో నాలుగు అడుగులు పెంచి నిర్మించాలని శృంగేరి పీఠాధిపతి సూచించారని పేర్కొన్నారు. పీఠాధిపతి స్వయంగా మార్గదర్శనం చేస్తూ రాతపూర్వకంగా శ్రీముఖం (ఆమోదపత్రం) అందజేస్తున్నారని కమిషనర్ వెల్లడించారు.