20 August, 2026 | 1:55 AM

అమరవీరుల త్యాగాలకు చిరస్మరణీయంగా స్థూపం నిర్మాణం

20-08-2026 12:46 AM

ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

ఆలేరు, ఆగస్ట్ 19: అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిపేలా తె లంగాణ అమరవీరుల స్థూపం నిర్మిస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. బుధవారం ఆలేరు పట్టణంలో అమరవీరుల స్తూపానికి ఆయన శంకుస్థాపన చేసిన తదుపరి మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో యువకులు, విద్యార్థులు, ఉద్యమకారులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారన్నారు. వారి త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ వించిందన్నారు. అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరచిపోకుండా, వారి స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆలేరు పట్టణంలోని అండర్పాస్ చౌ రస్తాకు తెలంగాణ అమరవీరుల చౌరస్తాగా నామకరణం చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.

అమరవీరుల స్థూపం నిర్మాణానికి అవసరమైన కట్టడ నిర్మాణ పనులను బీర్ల ఫౌండేషన్ నిధులతో చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబా లకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ, బిజెపి పార్టీ, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అమరవీరుల కుటుంబ సభ్యులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.