26 April, 2026 | 10:24 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

హైవేల నిర్మాణంలో వేగం పెంచండి

26-06-2024 01:41 AM

హైదరాబాద్- విజయవాడ 6 లేన్ల పనులు వెంటనే చేపట్టాలి

కల్వకుర్తి హైవేను 4 లేన్లుగా విస్తరించాలి

పెండింగ్ రోడ్ల పనులను వెంటనే పూర్తిచేయాలి

ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌కు మంత్రి కోమటిరెడ్డి వినతి

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న హైవేల పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. మంగళవారం సాయంత్రం న్యూఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఏఐ కార్యాలయంలో సంస్థ చైర్మన్ సంతోష్‌కుమార్‌యాదవ్‌తో కోమటిరెడ్డి సమావేశమై రాష్ర్టంలో పెండింగులో ఉన్న రహదారుల సమస్యల పరిష్కారం, పలు జాతీయ రహదారుల మంజూరు గురించి విన్నవించారు.

పదేండ్లుగా తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం నత్తనడకన సాగడం వల్ల వేలాదిమంది అమాయక ప్రజలు చనిపోతున్నారని ఎన్‌హెచ్‌ఎఐ చైర్మన్ దృష్టికి మంత్రి తీసుకుపోయారు. పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతం చేయడంతో పాటు వెంటనే జాతీయ రహదారుల నిర్మాణానికి పచ్చజెండా ఊపాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా బీవోటీ కన్సెషనరీ జీఎమ్మార్ సంస్థ వివాదం పరిష్కారం కోసం ఎదురుచూడకుండా హైదరాబాద్- విజయవాడ (ఎన్‌హెచ్--65) రోడ్డు నిర్మాణ పనులను ఆరు లేన్లుగా నిర్మించి ప్రమాదాలను నివారించాలని సూచించారు. ఎన్‌హెచ్--163 (హైదరాబాద్ మన్నెగూడ) రోడ్డుకు ఉన్న ఎన్జీటీ అనుమతులకు సత్వర పరిష్కారాన్ని కనుగొని ఏడాదికిపైగా పెండింగ్‌లో ఉన్న నాలుగు లేన్ల నిర్మాణాన్ని ప్రారంభించాలన్నారు. 

4 లేన్లుగా కల్వకుర్తి హైవే 

హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిత్యం వేలాది మంది ప్రయాణించే ఎన్‌హెచ్-765ను వెంటనే 4 లేన్లుగా విస్తరించాల్సిన అవసరం ఉందని కోమటిరెడ్డి తెలిపారు. అధిక వాహన రద్దీ వల్ల ప్రమాదాలకు కారణమవుతున్న ఈ హైవేను నాలుగు లేన్లుగా నిర్మించేందుకు కావాల్సిన డీపీఆర్ తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరగా చైర్మన్ తక్షణమే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రాష్ర్టంలో పెండింగ్‌లో ఉన్న వివిధ రహదారుల గురించి కూడా కోమటిరెడ్డి వివరంగా మ్యాపులతో ప్రజెంటేషన్ ఇచ్చి వీలైనంత త్వరగా పనులు ప్రారంభమయ్యేలా చొరవ చూపాలని కోరారు. మంత్రి వినతులపై సానుకూలంగా స్పందించిన ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్ అధికారులతో చర్చించి, త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరించి పనులు చేపడతామని తెలిపారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఇంజినీర్ -ఇన్-చీఫ్ (ఆర్‌అండ్‌బీ) గణపతిరెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.