6 June, 2026 | 2:13 AM

క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం

06-06-2026 01:08 AM
  1. ప్రభుత్వ భూముల్లో ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు వాటా
  2. 400 చదరపు అడుగుల విస్తీర్ణం
  3. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి 

హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): పేదల జీవనోపాధికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకొని క్యూర్ పరిధిలో పేదలు నివాసముంటున్న ప్రాంతాలకు సమీపంలోనే అల్పాదాయ (ఎల్‌ఐజీ ), మధ్యతరగతి (ఎంఐజీ) వర్గాలకు లక్ష ఇండ్లు నిర్మించబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ స్థలాలల్లో లక్ష ఇండ్లను నిర్మించి ఆ స్థలంలో వారి వాటాకు యజమానిని చేస్తూ పెదింటి ఆడబిడ్డలకు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు.

2026 - 27 ఆర్థిక సంవత్సరానికి క్యూర్ పరిధిలో లక్ష ఇండ్లకు ఇతర ప్రాంతాలల్లో 2.50 లక్షలు మొత్తం 3.50 లక్షల ఇండ్లకు ఇప్పటికే పరిపాలనపరమైన అనుమతులు ఇచ్చామని, దీనిని దృష్టిలోపెట్టుకొని అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం పేదల జీవన పరిస్థితులను, వారి ఉపాధి అవసరాలను ఏ మాత్రం పట్టించుకోకుండా హైదరాబాద్ నగరానికి 30- నుంచి 40 కిలోమీటర్ల దూరంలో అరకొరగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించిందని విమర్శించారు.

దీంతో వారి ఉపాధి, పిల్లల విద్య, వైద్యం తదితరాల దృష్ట్యా నిరుపేదలు అక్కడికి వెళ్లలేకపోయారని చెప్పారు. ఇలాంటి తప్పిదాలను పునరావృతం చేయకుండా పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాల్లోనే గౌరవప్రదమైన జీవితం గడిపేలా ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టబోతున్నామని, ఈ దిశగా విలువైన ప్రభుత్వ భూములను పేదల సంక్షేమం కోసం వినియోగిస్తూ లక్ష ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు.

పేద కుటుంబాల మహిళలకు సొంతింటిపై హక్కు కల్పించడం ద్వారా వారి ఆర్థిక, సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పేదల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారికి సౌకర్యవంతంగా ఉండేలా ఇండ్ల డిజైన్‌లను రూపొందించాలని, ఇంటి నిర్మాణం కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేలా ప్లాన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ శాఖ సెక్రెటరీ వీపీ గౌతమ్ పాల్గొన్నారు.