28 July, 2026 | 12:56 AM

ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే నేరాల నియంత్రణ సాధ్యం

28-07-2026 12:00 AM
  1. శ్రీనివాస్ హైట్స్‌లో డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన
  2. సీఐ రామలింగారెడ్డి

ఉప్పల్, జూలై 27 (విజయక్రాంతి): ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ హైట్స్ అపార్ట్మెంట్లో యాంటీ డ్రగ్స్, మీ సురక్ష మరియు సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ సీఐ రామలింగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ రామలింగారెడ్డి మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ సమాజానికి, కుటుంబాలకు తీవ్ర నష్టం కలిగిస్తాయని అన్నారు.

మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు.

అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులు, సోషల్ మీడియా సందేశాల పట్ల జాగ్రత్త వహించాలని తెలిపారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మీ సురక్ష కార్యక్రమం ద్వారా మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ అందిస్తున్న సేవలను వివరించారు. ప్రజల భాగస్వామ్యంతోనే నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందని సీఐ రామలింగారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ నివాసులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.