25 March, 2026 | 11:24 PM

బెజుగం చెరువు జీపీ భవన నిర్మాణంపై వివాదం

25-03-2026 09:59 PM

సర్పంచ్ భాస్కర్ నిరసన

మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట బైఠాయింపు

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): బెజుగం చెరువు గ్రామ సర్పంచ్ భాస్కర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట బైఠాయింపు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ (జీపీ) భవన నిర్మాణానికి సంబంధించి అధికారుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ భాస్కర్ మాట్లాడుతూ... గ్రామసభలో జీపీ భవన నిర్మాణంపై తీర్మానం చేసి అధికారులకు సమర్పించినప్పటికీ, ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

గ్రామపంచాయతీకి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కొత్త భవనం నిర్మాణానికి మార్కౌట్ ఇవ్వడం అన్యాయమని ఆయన అన్నారు. సర్పంచ్ లేదా ఉప సర్పంచ్‌కు సమాచారం ఇవ్వకుండా అధికారులు గ్రామానికి రావడం ప్రోటోకాల్‌కు విరుద్ధమని పేర్కొన్నారు. ఎంపీడీవో, ఎంపీవో అధికారులపై విమర్శలు గుప్పిస్తూ, గ్రామస్థాయిలో తీసుకున్న నిర్ణయాలను గౌరవించకుండా స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గ్రామసభలో నిర్ణయించిన ప్రదేశంలోనే జీపీ భవన నిర్మాణం చేపట్టాలని సర్పంచ్ భాస్కర్ డిమాండ్ చేశారు.