calender_icon.png 6 May, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ రహదారిని 8 లైన్ల రోడ్డుగా మార్చండి

06-05-2025 12:00:00 AM

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి పొన్నం విజ్ఞప్తి

కరీంనగర్, మే 5 (విజయక్రాంతి) : హైదరాబాద్ నుండి రామగుండం వరకు కరీంనగర్మదుగా వెళ్లే రాజీవ్ రహదారిని 8 లైన్ల రహదారిగా మార్చాలని కోరుతూ రాష్ర్ట బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర జాతీయ రహదారులు రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖను పంపించారు.

ఈ రోడ్డు విస్తరణతో ఈ ప్రాంతం సామాజిక, ఆర్థిక అభివృద్ధికి, లక్షలాది మంది ప్రయాణికుల భద్రత, సౌలభ్యం కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న రాజీవ్ రహదారి రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ డిమాండ్ కు సరిపోవడం లేదని, రామగుండం, కరీంనగర్ చుట్టుపక్కల పారిశ్రామిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఎన్టీపీసీ రామగుండు పవర్ ప్లాంట్, రామగుండం ఫర్టిలైజర్, కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీలు కొనసాగుతున్నాయని, ప్రస్తుత రోడ్ల సామర్ధ్యానికి మించిన కార్మికులు, సరుకు రవాణా ఈ రోడ్డుపై ట్రాఫిక్ భారం పడుతుందని తెలిపారు. వెంటనే రాజీవ్ రహదారిని 8 లైన్ల రోడ్డుగా మార్చాలని కేంద్ర మంత్రిని పొన్నం ప్రభాకర్ కోరారు.