06-05-2025 12:00:00 AM
మీడియా సమావేశంలో కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి మే 5 (విజయక్రాంతి) ః ప్రభుత్వ జారీచేసిన నిబంధనలో ప్రకారం ప్రాధాన్యత కార్యక్రమాలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్ చట్టం పై సుల్తానాబాద్ మండలం మినహా అన్ని మండలాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ధరణి చట్టం, భూ భారతి చట్టం మధ్య వ్యత్యాసాలను స్పష్టంగా రైతులకు వివరించామన్నారు.
ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో మే ఐదు నుంచి మే 19 వరకు ఎలిగేడు మండలంలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, భూ భారతి చట్టం క్రింద భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, రెవెన్యూ సదస్సులలో వచ్చే దరఖాస్తులను పూర్తిస్థాయిలో జూన్ 2 వరకు పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.కోర్టు కేసుల సమస్యలు, కుటుంబ వివాదాల సమస్యలు మినహాయించి మిగిలిన అన్ని రకాల సమస్యలను భూ భారతి చట్టం వినియోగించి పరిష్కరిస్తామన్నారు.
ప్రతిరోజు రెవెన్యూ సదస్సులో ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయో సమగ్ర రికార్డు నిర్వహిస్తున్నామని, ఆర్‌ఎస్‌ఆర్, అసెన్మైంట్ సమస్యలు, సాధా బైనామా దరఖాస్తులు, పార్టు - బీ సమస్యలు, ఇతర వివిధ రకాల భూ సమస్యలను భూ భారతి చట్టం ద్వారా పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ కమిటీ ఆమోదించిన దరఖాస్తుల ధ్రువీకరణ తర్వాత జిల్లా ఇంచార్జి మంత్రి ఆమోదంతో మంజూరు పత్రాలు పంపిణీ చేసి గ్రౌండ్ చేస్తామని తెలిపారు . ఈ సమావేశంలో పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు.