5 May, 2026 | 4:18 AM

చల్లని కబురు

29-05-2024 12:05 AM

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలో అంటే  జూన్ 1వ తేదీకి ఒకటి, రెండు రోజులు అటూఇటుగా కేరళ తీరాన్ని తాకనున్నట్లు ప్రకటించి భారత వాతావరణ శాఖ రైతాంగానికి చల్లటి కబు రును అందించింది. అంతేకాక, ఈ ఏడాది వర్షాలు సాధారణం కన్నా ఎక్కువే కురుస్తాయనీ చెప్పడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మధ్య, దక్షిణ భారతంలో సాధారణం కన్నా ఎక్కువే వర్షాలు కురుస్తాయని చెప్పడం  విశేషం. ఎందుకంటే, మన దేశంలో వ్యవసాయం 70 శాతానికిపైగా నైరుతి రుతువవనాలపైనే ఆధారపడి ఉంటుంది.

ఎల్‌నినో ప్రభావం కారణంగా గత ఏడాది దక్షిణాది రాష్ట్రాలతోపాటు అనేక రాష్ట్రాల్లో మామూలుకన్నా తక్కువ వర్షపాతం నమోద యింది. ఫలితంగా ప్రధాన ప్రాజెక్టులు పొంగి ప్రవహించడం మాట అటుంచి నిండలేదు కూడా. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలుసహా కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అటు సాగునీటికి, ఇటు తాగునీటికీ కటకట ఎదురయింది. మరోవైపు భానుడి ప్రతాపంతో ఈ వేసవిలో గతం లో ఎన్నడూ లేని విధంగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి. ఈ పరిస్థితి దాదాపు రెండు వారాలపాటు కొనసాగింది.

దీంతో ఏప్రి ల్ నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే మే నెలలో అదీ రోహిణి కార్తె సమయం లో ఎండలు ఎంతగా మండి పోతాయోనని జనం భయపడిపోయారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో వివిధ పార్టీల నేతలు మండే ఎండల్లోనే ప్రచారం కొనసాగించారు. పోలింగ్ ముగిసే సమయానికి  ఎండలు కాస్త తగ్గుముఖం పట్టడంతో అడపాదడపా వర్షాలూ కురవడంతో  అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పటికీ నిప్పుల కొలిమిలా  మండి పోతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్‌లో గత నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు పైగా కొనసాగుతున్నాయి.  రాష్ట్రంలోని పలోడిలో రెండు రోజుల క్రితం దేశంలోనే అత్యధికంగా 51 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయింది.

దేశ రాజధాని ఢిల్లీ సైతం ఉష్ణతాపంతో ఉడికి పోతోంది. వేసవి విడిదిగా దేశ విదేశాలకు చెందిన లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షించే కశ్మీర్‌లోనూ ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అత్యధికంగా 30 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. దీనితో పర్యాటకుల సంఖ్యకూడా తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. అటు పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్రం కూడా వడగాడ్పులతో అల్లాడిపోతోంది. అక్కడ 52 డిగ్రీలకు  ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలు తుపాను కారణంగా భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న విచిత్ర పరిస్థితి.

ఒకసారి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తే వాతావరణమంతా చల్లబడుతుంది. రుతుపవనాలు దేశమంతా విస్తరించడానికి మరికొన్ని రోజు లు పట్టినప్పటికీ వేడిగాడ్పులు ఉండవు. ఇక, రుతుపవనాలు తెలంగాణలోకి జూన్ మొదటి వారంలో ప్రవేశించవచ్చన్న వాతావరణ శాఖ అంచ నాలతో రైతులు అప్పుడే దుక్కులు దున్ని విత్తనాల కోసం  సొసైటీల ముందు క్యూ కడుతున్నారు. సరిపడినంతగా స్టాక్ లేకపోవడంతో అధికారులపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేసున్నట్లు కూడా వార్తలు వస్తున్నా యి.

నిన్న మొన్నటి వరకు ఎన్నికల హడావుడిలో తలమునకలుగా ఉండి న ప్రభుత్వం, అధికారులు ఇకనైనా  వ్యవసాయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మొన్నటిదాకా యాసంగి పంట కొనుగోళ్లు సరిగా జరక్క అకాల వర్షాలతో నష్టపోయిన రైతన్నలు ఇప్పుడు విత్తనాల కోసమూ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వస్తోంది. మరోవైపు ఇదే సాకుగా కొంత మంది నకిలీ విత్తనాల దందాకు దిగుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. రైతన్నలు మరోసారి రోడ్డెక్కకుండా అధికారులు సకాలంలో స్పందించాలి. కావలసిన మేరకు విత్తనాలు, ఎరువులు రైతులందరికీ అందిస్తే బాగుంటుంది. లేకపోతే, ఎంతగా సకాలంలో వర్షాలు కురిసినా రైతు కంటనీరే మిగులుతుంది. గత ఏడాది దిగాలు పడిన రైతు ముఖంలో ఈ ఏడాదైనా  సంతోషాన్ని చూసే పరిస్థితి రావాలని ఆశిద్దాం.