ఆహారానికి అనారోగ్యం ఉచితం
గత కొన్ని రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లపై జరుపుతున్న దాడు ల్లో విస్తుపోయే విషయలు వెలుగులోకి వచ్చాయి. మొదట జంట నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు చేసిన అధికారులు ఇప్పుడు ఇతర జిల్లాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాడు లు జరిపిన ప్రతిచోటా అధికారులకు సాధారణంగా కనిపిస్తున్న దృశ్యాలు పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థా లు, కల్తీ మసాలాలు, మళ్లీమళ్లీ కాచి వాడుతున్న నూనెలు. ఫ్రిజ్‌లో వారం, పది రోజులపాటు నిల్వ ఉంచిన మాంసం, చేపలు, ఇంకా కిచెన్‌ల పరిస్థితి అయితే మరింత దారుణం.
బొద్దింకలు, ఎలుకల స్వైర విహారంతోపాటు మురుగు వాసన, ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం. రోడ్డు పక్కన ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు, బేకరీలు, కాఫీ షాపుల్లోనే కాదు, పేరు మోసిన ప్రముఖ రెస్టారెంట్లలోనూ ఇదే పరిస్థితి. నాన్‌వెజ్ రెస్టారెంట్ల్ల తో పోలిస్తే శాఖాహార హోటళ్లలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ అక్కడ కూడా పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. బయట విద్యుద్దీపాలతో వెలిగి పోతూ కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉండే ఈ తినుబండారాల శాలల్లో వెనుక భాగంలో అంటే వంటలు చేసేచోట, పాత్రలు శుభ్రం చేసే చోట ఉండే అపరిశుభ్రత భరింప శక్యం కాని రీతిలో ఉంటోందని ఫుడ్ సేఫ్టీ అధికారులే చెబుతున్నారు. వారాంతాల్లో కస్టమ ర్లతో కళకళలాడే ప్రముఖ రెస్టారెంట్ల వంటశాలలలో చెడిపోయిన పదార్థాలు, బూజు పట్టిన కూరగాయలు దర్శనమివ్వడం అధికారులను ఆశ్చర్యపరిచింది.
బిర్యానీకి వెయ్యి, చికిత్సకు లక్ష
ఇటీవల షాద్‌నగర్‌లో ఓ కుటుంబానికి ఎదురైన అనుభవం చూస్తే పేరు మోసిన రెస్టారెంట్లలో సైతం ఆహారం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. మ్యారేజ్ డే పార్టీ కోసం ఆ కుటుంబ సభ్యులంతా షాద్‌నగర్‌లోని ఓ పేరు మోసిన ‘మండీ’ రెస్టారెంట్‌కు భోజనం చేయడానికి వెళ్లా రు. అక్కడ బిర్యానీ బాగుంటుందన్న పేరు ఉండడంతో అందరూ బిర్యానీ ఆర్డరిచ్చి తిన్నారు. తిన్న కొద్ది గంటలకే అందరికీ వాంతులు, విరోచనాలు మొదలు కావడంతో డాక్టర్‌వద్దకు వెళ్తే ఫుడ్ పాయిజన్ అని తేల్చారు. కుటుంబంలోని ఎనిమిది మంది కుటుంబ సభ్యులకూ అదే పరిస్థితి. బిర్యానీకి వెయ్యి రూపాయలు ఖర్చయితే, ఫుడ్‌పాయిజన్ ట్రీట్‌మెంట్‌కు ఒక్కొక్కరికి అంతకు పదింతలు ఖర్చయిందని ఆ కుటుంబం వాపోయింది.
స్ట్రీట్ ఫుడ్ సెంటర్ల మాటేమిటి?
ఒక్క జంట నగరాల్లోనే కొన్ని వందల సంఖ్యలో పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. బయటి వాటితో పోలిస్తే ఇక్కడ పదార్థాల ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ రుచి, శుచి ఉంటాయన్న నమ్మకంతో చాలామంది కస్టమర్లు ఈ హోటళ్లకే వస్తుంటారు. కానీ, ఆ హోటళ్లలో కూడా బయట కనిపించిన శుచీ, శుభ్రత లోపల వంటశాలల్లో ఉండడం లేదని ఆహార భద్రతా అధికారుల సోదా ల్లో వెల్లడయింది. ఇక్కడే ఇలా ఉంటే రోడ్ల పక్కన ఉన్న వేలాది ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, డాబాల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించడం కష్టం. వైద్య, ఆరోగ్య శాఖకు అనుబంధంగా ఉండే ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా గత ఇరవై రోజులుగా జంటనగరాల్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. రాజధానిలోనే కాకుండా కరీంనగర్, భద్రాచలం లాంటి ఇతర ప్రాంతాల్లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని రెస్టారెంట్లకు జరిమానాలు విధించారు.
వీకెండ్ రాయుళ్లు
రోజూ ఇంటి తిండి తిని బోర్ కొట్టి వారాంతంలోనైనా బయట వెరైటీ ఫుడ్ తిండి తిందామనుకునే వాళ్లు కొందరైతే, వంట చేయడం బోర్ అనిపించి బయట ఏ చికెన్ బిర్యానీయో, ఫ్రైడ్ ఐటమ్స్‌తోనో కడుపు నింపుకుందామనుకునే వారు ఈ రోజుల్లో పట్టణాల్లోనూ ఎక్కువయ్యారు. నగరాల్లో ఉద్యోగాల హడావుడి కారణంగా వండుకునే టైమ్ లేక బైట తిండి తింటున్నారనుకుంటే పర్వాలేదు. చిన్నచిన్న పట్టణాల్లో సైతం ఇదే సంస్కృతి కనిపిస్తోంది. అందుకే, వీధికో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పుట్టుకొస్తోంది.
అయితే, ఆదా యం మాత్రమే పరమార్థంగా పుట్టుకొచ్చిన వీటిలో శుచీ, శుభ్రతకు ఎంతమా త్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదనే మాట నిజం. ఈ కారణంగానే ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్‌తో బాధ పడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న వాళ్ల వార్తలు వస్తున్నాయి. ఇది ఒక విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాట మాడడమేనని చెప్పాలి. తాజాగా వెలుగు చూసిన ఘటనల తర్వాత బయట తిండి తినాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. ‘తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్లు ప్రతి ఒక్కరినీ ఒకటికి పదిసార్లు ఆలోచించేలా చేస్తున్నాయి.
అన్ని చోట్లా ఒకే సమస్యలు
తాము దాడులు నిర్వహించిన పలు హోటళ్లలో వంటల తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాల్లో నాణ్యత లేకపోగా చాలావరకు కాలం చెల్లినవి, పాడైపోయినవీ ఉంటున్నాయని ఆహార భద్రతా తనిఖీ అధికారి ఒకరు తెలిపారు. గడువు తీరినవి, ఎలాంటి బ్రాండ్లు లేని పాల ప్యాకెట్లను తక్కువ ధరకు కొని వాడుతున్నారని పేర్కొన్నారు. వండిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచుతున్నారని, ఆర్డర్ వచ్చినప్పుడు వేడి చేసి మసాలాలు కలిపి ఇస్తున్నారని అధికారు లు చెప్తున్నారు. ఈ మాటలు చాలావరకు నిజం. మన కళ్ల ముందే ఎప్పుడో వండిన అన్నాన్ని కడాయిలో వేసి రకరకాల మసాలాలు జోడించి ఫ్రైడ్ రైస్ పేరిట వేడి వేడిగా వడ్డిస్తే లొట్ట లేసుకుని తింటాం. ఇక పెద్దపెద్ద హోటళ్లలో రోజుల తరబడి నిల్వ ఉంచే సదుపాయాలు ఉంటే వాటినే తిరిగి ఎందుకు ఉపయోగించుకోరు?
మొక్కుబడి కారాదు
ఇప్పుడు జరిపిన దాడులు ఏడాది పొడవునా జరపాల్సిన అవసరం ఎంతయినా ఉంది. పై ఆధికారులు ఆదేశించా రనో లేదా ప్రభుత్వ పెద్దల నుంచి తాఖీదులు వచ్చాయనో మొక్కుబడిగా హడావుడి చేసి ఆ తర్వాత మళ్లీ పట్టించుకోకపోతే పరిస్థితి మామూలై పోతుంది. ఇదే విషయంపై రాష్ట్ర ఆహార భద్రత విభాగం ఉన్నతాధికారి వద్ద ప్రస్తావిస్తే, తమ విభాగంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించడానికి తగినంతమంది సిబ్బంది లేకపోవడం సమస్యగా ఉందని ఆయన చెప్తూ, కొత్త ప్రభుత్వం వచ్చాక సిబ్బందిని రిక్రూట్ చేసుకో వడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పడం గమనార్హం. కాగా, హోటళ్లు, రెస్టారెంట్లలో శుచీ, శుభ్రత పాటించేలా చూడడం కోసం వీటిలో పని చేసే సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామని, ఇప్పటికే దాదాపు 2,500 మందికి అవగాహన కల్పించామని ఈ శాఖ అధికారులు చెప్పారు. అధికారులు అవగాహన కల్పించినంత మాత్రాన చాలదు.
వ్యాపారాలు నిర్వహిస్తున్న వాళ్లు సైతం పరిశుభ్రతపై ప్రధా నంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి అధికారుల దాడుల్లో పట్టుబడితే అప్పటి వరకు ఉన్న పేరు ప్రఖ్యాతులు అన్నీ పోతాయనే విషయాన్ని గుర్తుంచుకుని వారు ఈ విషయంపై శ్రద్ధ వహించాలి. కస్టమర్లు కూడా పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ శుభ్రంగా ఉన్న హోటళ్లకు వెళ్తే తమ ఆరోగ్యం కాపాడుకోగలుగుతారు. ఎక్కడ పడితే అక్కడ తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే చేజేతులా పాడు చేసు కున్న వాళ్లమవుతాం. ఏది ఏమయినా శుచీ శుభ్రత అనేది సమాజానికి సంబంధించిన సమస్య. సమాజంలోని అన్ని వర్గాల వాళ్లు పట్టించుకుంటేనే ఇది పరిష్కారమవుతుంది. లేకపోతే, ఇదో పెద్ద సమస్యగా మారుతుంది. అప్పుడు పరిష్కారం కనుగొనడం కష్టమవుతుంది.
-కె.రామకృష్ణ






