21-01-2026 12:00:26 AM
షాద్నగర్, జనవరి 20 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్ది, పేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నామని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని 20వ వార్డు (పాత గంజి)లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం విద్య మరియు వైద్య రంగాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
దవాఖానాల్లో రక్త పరీక్షలతో పాటు అవసరమైన మందులు ఉచితంగా లభిస్తాయని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. త్వరలోనే షాద్నగర్ పట్టణంలో త్వరలోనే 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని అందుబాటులోకి తె చ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్‌ఓ లలితాదేవి, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొంకల చెన్నయ్య ముదిరాజ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం ఇతర నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.