calender_icon.png 17 November, 2025 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ తనిఖీలు చేస్తున్నా తగ్గని అవినీతి

17-11-2025 01:41:09 AM

  1. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో  రైటర్‌లదే రాజ్యం 

వారి ద్వారానే ప్రతి డాక్యుమెంటుకు రూ. వేలల్లో వసూలు

తనిఖీల్లో పట్టుబడుతున్న డాక్యుమెంటు రైటర్లు తదుపరి చర్యలు శూన్యం 

మేడ్చల్, నవంబర్ 16 (విజయ క్రాంతి): సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారాయి. ఈ కార్యాల యాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో ఏసీబీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నప్పటికీ అధికారుల తీరు మారడం లేదు. మేడ్చల్ జిల్లాలో వారం రోజుల్లో నాలుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీ చేయగా, అన్నిచోట్ల డాక్యుమెంటు రైటర్లను గుర్తించారు. ఈనెల 6న కుట్బుల్లాపూర్, కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు.

ఆ సమయంలో కార్యాలయంలో పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు. ఏసీబీ అధికారుల తనిఖీలు జరుగుతున్న విషయం తెలిసి ఏ కార్యాలయంలో నైనా అధికారులు అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ క్షణంలో ఎలా వస్తారో, ఏమి లభిస్తుందోనని భయంగా ఉంటారు. కానీ రిజిస్టార్ కార్యాలయాల్లో అధికారుల్లో మాత్రం భయం కనిపించడం లేదు. ఈనెల 14న మేడ్చల్, షామీర్పేట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో తనిఖీ చేయగా పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్ రైటర్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. తనిఖీ చేసిన ఏమవుతుందిలే అని నిర్భయంగా డాక్యుమెంట రైటర్లను కార్యాలయాల్లోకి అనుమతిస్తున్నారు. 

మధ్యవర్తులు డాక్యుమెంట్ రైటర్ లే 

మేడ్చల్ జిల్లాలో మేడ్చల్, షామీర్పేట్, కీసర, కుదుపుల్లాపూర్, ఉప్పల్, నారపల్లి, కాప్రా, ఘట్కేసర్, మల్కాజిగిరి, కూకట్పల్లి, బాలానగర్, వల్లబ్ నగర్ లో సబ్ రిజిస్టార్ కార్యాలయాలు, మేడ్చల్ లో జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉన్నాయి. ఇవన్నీ హైదరాబాద్ ప్రాంతానికి శివారు ప్రాంతాలైనందున క్రయవిక్రయాలు పెద్ద మొత్తంలో జరుగుతాయి.

అంతేగాక అధికారులకు ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంటుంది. శివారు ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం పైరవీలు చేస్తారు. డాక్యుమెంట్ రైటర్లు మధ్యవర్తులుగా ఉండి వివిధ కేసులను డీల్ చేస్తున్నారు. స్లాట్ బుక్ చేసుకుని డాక్యుమెంట్ సబ్మిట్ చేసి, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. కానీ నేరుగా వస్తే పని జరగదు.

డాక్యుమెంట్ రైటర్లను తప్పనిసరిగా కలిసి వారి ద్వారానే వెళ్లాలి. డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థను అనేక ఏళ్ల క్రితమే తీసివేశారు. కానీ అన్ని  రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ వ్యవస్థ అనధికారికంగా కొనసాగుతోంది. పరిసరాల్లో వారి కార్యాలయాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. డాక్యుమెంటు కు ఇంత అని వసూలు చేసి సబ్ రిజిస్టర్లకు అప్పచెబుతున్నారు. 

ఏ భూమైనా రిజిస్ట్రేషన్ 

గ్రామపంచాయతీ లేఔట్ అయిన, ప్రభుత్వ భూమి అయినా, చెరువు శిఖం భూమి అయినా, నిషేధిత భూమి అయిన సబ్ రిజిస్టార్లు పట్టా చేస్తున్నారు. మధ్యవర్తులు సబ్ రిజిస్టర్ లతో మాట్లాడి సెట్ చేస్తున్నారు. ఇటీవల మేడ్చల్ లో గ్రామపంచాయతీ హయాంలో లేఅవుట్ చేసిన చెరువు శిఖంలో ప్లాట్ లను పట్టా చేశారు. వల్లభ నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కానాజీ గూడ రెవెన్యూ పరిధిలో గ్రీన్ ఫీల్ కాలనీలో నిషేధిత జాబితాలో ఉన్న స్థలాలను రిజిస్ట్రేషన్ చేశారు. 

చర్యలు శూన్యం 

ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో తనిఖీ చేసి డాక్యుమెంట్ రైటర్లను పట్టుకున్నారు. వీరిని విచారించి వదిలేశారు. కానీ తదుపరి చర్యలు తీసుకోనందున ఏమి కాదులే అనే భావన ఏర్పడుతోంది. సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో పెద్ద మొత్తంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్న అని తెలిసినా చర్యలు తీసుకోవడం లేదు. జరిగిన రిజిస్ట్రేషన్ లపై విచారణ జరిపితే అక్రమాలు బయటపడతాయి.

అంతేగాక సబ్ రిజిస్టార్ ల ఇళ్ళలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తే అక్రమ సంపాదన బయటపడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నామమాత్రపు తనిఖీల వల్ల మార్పు కనిపించే అవకాశం లేదని అంటున్నారు.