12-09-2025 12:00:00 AM
-రాష్ర్ట ఆర్థిక పరిస్థితి బాగాలేదు
-జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి
బోథ్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): పేద ప్రజల సంక్షేమార్థం ప్రజా పాలన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవినీతి జరిగితే సహించేది లేదని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరైనా లంచం అడిగిన వెంటనే 9848014089 నంబర్ కు వాట్సప్ చేయాలని తక్షణమే చర్యలు తీసుకుంటామని అన్నారు. గురువారం బోథ్ నియోజకవర్గ కేంద్రంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ముందుగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ఎంపీ గోడం నగేష్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. అలాగే స్థానిక గురుకుల పాఠశాలలో 4.15 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన డార్మెటరీ భవనాలను ప్రారంభించారు.
అనంతరం స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గస్థాయి ప్రజల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బోథ్ నియోజకవర్గానికి రూ. 250 కోట్ల రూపాయలతో 5,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయి అన్నారు. ఇప్పటివరకు 2,940 ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోయడం జరిగిందని, మిగతా ఇల్లు వివిధ దశలలో ఉన్నాయని తెలిపారు. ఒక్కో ఇందిరమ్మ ఇళ్లకు ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుందని అవి వివిధ దశలలో అందజేస్తారన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాబడి నిర్మాణం చేపట్టలేని వారికి బ్యాంకు ద్వారా మహిళా సంఘాలు అప్పుగా తీసుకొని నిర్మాణం చేపట్టాలని సూచించారు.
రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని అరులైన వారందరికీ కార్డులు జారీ చేయబడతాయని అన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో రేషన్ కార్డుల కొరకు 13 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని అందులో 10280 నూతన రేషన్ కార్డులు జారీ చేశామన్నారు. నూతనంగా 1331 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశామన్నారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుని వివరాలు సంబంధిత సెక్రటరీ వారం లోపు అప్లోడ్ చేయాలని సూచించారు. సంబంధిత అధికారులు 15 రోజులలోగా లబ్ధిదారునికి చెక్కును అందజేయాలని, ఆలస్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయం సహాయక మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 4 కోట్ల 86 లక్షల 19 వేలు వడ్డీ లేని రుణాలను అందించాలని తెలిపారు. అలాగే మహిళా సంఘాలకు పెట్రోల్ బంకుల ఏర్పాటు, ఆర్టీసీలో బస్సుల కేటాయింపు లాంటి వెసులుబాటు కల్పిస్తామన్నారు.
బోథ్ నియోజకవర్గ కేంద్రంను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని అలాగే డిగ్రీ కళాశాల, ఫైర్ స్టేషన్, రెండు వరుసల రహదారి, లైబ్రరీ, మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్, సీపీఐ, బోథ్ విడిసి నాయకులు కోరగా మంత్రి సానుకూలంగా స్పందించి బోథ్ అభివృద్ధికి ప్రయత్నిస్తానని తెలిపారు. అసలే రాష్ర్ట ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఆ విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అని అన్నారు.
కచ్చితంగా చేస్తా అని చెప్పను గాని అభివృద్ధికి మాత్రం సహకరిస్తానని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విటల్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య, నాయకులు ఆడే గజేందర్, ఎస్పీ అఖిల్ మహాజన్, అసిస్టెంట్ కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా, డీఎస్పీ జీవన్ రెడ్డి పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.