calender_icon.png 12 September, 2025 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌కు ‘గ్రీన్ లీడర్‌షిప్’ అవార్డు

12-09-2025 12:00:00 AM

న్యూయార్క్‌లో నెలాఖరున మాజీ మంత్రికి ప్రదానం

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి) : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో చేసిన కృషికి ‘గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు కేటీఆర్ ఎంపికయ్యారు. ఈ నెల చివరిలో అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ విషయాన్ని గ్రీన్ మెంటార్స్ సంస్థ అధికారికంగా కేటీఆర్‌కు తెలియజేసింది. ఈ గౌరవంతో సుస్థిర, నివాసయోగ్యమైన నగరాలను సృష్టించడానికి కృషిచేసిన ప్రపంచ నాయకుల జాబితాలో కేటీఆర్ చేరారు.

మంత్రిగా అనేక పర్యావరణ కార్యక్రమాల పర్యవేక్షణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కేటీఆర్ తెలంగాణలో అనేక పర్యావరణ కార్యక్రమాలను పర్యవేక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెఎంసీ) పరిధిలో 977 పార్కులను అభివృద్ధి చేసి, 10 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో పాటు, 108 లంగ్ స్పేస్‌లు, థీమ్ పార్కులు, రెయిన్ గార్డెన్స్, ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్, వర్టికల్ గార్డెన్లను ఏర్పాటు చేయిం చారు. సంస్థాగత తోటలు, కాలనీ, వీధి తోటలు, మీడియన్, అవెన్యూ తోటల పెంపకానికి పెద్ద ఎత్తున కృషి చేసి, తెలంగాణ పచ్చదనాన్ని గణనీయంగా పెంచారు. ఈ కృషి ఫలితంగా హైదరాబాద్‌కు ప్రతిష్టాత్మకమైన వరల్డ్ గ్రీన్ సిటీస్ అవార్డు లభించింది. అంతేకాకుండా, ఆర్బర్ డే ఫౌండేషన్, ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా గుర్తింపు పొందిన భారతీయ నగరంగా నిలిచింది.