03-11-2025 12:27:50 PM
జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన పత్తి రైతులు
భారీగా నిలిచిన వాహనాలు
అలంపూర్: పత్తి రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులు(Cotton farmers) ఆందోళన చేపట్టారు. గద్వాల జిల్లా ఉండవల్లి మండల పరిధిలోని వరసిద్ధి వినాయక కాటన్ మిల్లు ఎదుట 44వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం పత్తి రైతులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. పత్తి పండించిన రైతుల నుంచి ఎకరాకు 12 క్వింటాల చొప్పున పత్తిని కొంటామని చెప్పి ఇప్పుడు ఏడు క్వింటాలే మాత్రమే కొనాలి అనే ఆదేశాలు వచ్చినట్లు సీసీఐ అధికారులు చెప్పారు.
అప్పటికే రైతులు స్లాట్ బుక్ చేసుకొని వివిధ ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు బోలోరా వాహనాలలో పత్తిని నింపుకుని సీసీఐ కేంద్రం వద్దకు తీసుకువచ్చారు. దీంతో అధికారులు 7 క్వింటాలు మాత్రమే కొనాలని ఆదేశాలు వచ్చినట్లు తెలపడంతో రైతులందరూ ఒక్కసారిగా జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల నుంచి ఎకరాకు 12 క్వింటాల పత్తిని కొనాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటికే అధిక వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని మళ్లీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం ఏంటని మండిపడ్డారు.