1 July, 2026 | 2:15 AM

వర్షాకాల సన్నద్ధతపై కౌన్సిల్ ఫోకస్

01-07-2026 01:09 AM

గజ్వేల్, జూన్ 30: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం లో వర్షాకాలానికి ముందస్తు చర్యలు, పట్టణాభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించి ప లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఛైర్పర్సన్ గంగిశెట్టి చందన ర వీందర్ అధ్యక్షతన, కమిషనర్ గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రజా సౌకర్యాల మెరుగుదలపై సభ్యులు తమ అభిప్రాయాలు వెల్లడించారు.

వర్షాకాలంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రతి ఇంటి నుంచి 100 శాతం చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు, చెత్త సేకరణ వాహనాలు ప్రతిరోజూ అన్ని వార్డుల్లో క్రమం తప్పకుండా తిరిగేలా కఠిన పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

కౌన్సిలర్లు తమ వార్డుల్లో తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, ఇతర మౌలిక వసతుల సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా, వాటిని ప్రాధాన్యత క్రమంలో వెంటనే పరిష్కరించాలని ఛైర్పర్సన్, కమిషనర్ సంబంధిత అధికారులకు సూచించారు. పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి వార్డులో ఇంటింటా మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. అలాగే పట్టణంలోని పార్కుల నిర్వహణ, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజలకు మెరుగైన వాతావరణం కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.