17 June, 2026 | 4:19 AM

బెల్లంపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ

17-06-2026 02:42 AM

 బెల్లంపల్లి, జూన్ 16 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా మంగళవారం మంచిర్యాల డీ సీ పీ ఎగ్గడి భాస్కర్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు. సర్కిల్ పరిధిలో రోజువారీ గా నమోదవుతున్న ఫిర్యాదులు, కేసుల రికార్డులను పరిశీలించి,రూరల్ సర్కిల్ కార్యాల య పరిధిలో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసుల స్థితిగతులు, నిందితుల అరెస్టులు, కేసుల దర్యాప్తు పురోగతికి సంబంధించిన ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

పెండింగ్లో ఉన్న కేసులు, దర్యాప్తు వివరాలను సీఐ హనుక్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసు విధుల పట్ల అంకిత భావంతో ఉండాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రేవ్ కేసుల్లో జాప్యం లేకుండా నిందితులను త్వరితగతిన అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచాలని తెలిపారు. విచారణ, దర్యాప్తు సమయంలో భౌతిక సాక్ష్యాలతో పాటు సాంకేతిక ఆధారాలను కూడా వినియోగించాలని సూచించారు.

నేరాల నియంత్రణ, దొంగతనాల నిర్మూలన కోసం అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్టమైన పెట్రోలింగ్ నిర్వహించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపట్టి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు. నేరాల నియంత్రణకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలను చైతన్యపరచాలని, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రజలు అందజేసే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులకు భద్రత, భరోసా కల్పించే విధంగా పోలీసు వ్యవస్థ పనిచేయాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం పోలీసు అధికారులతో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. సీపీ వెంట బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్, ఎస్‌ఐలు ఉన్నారు.