17-11-2025 12:27:22 PM
ఐబొమ్మ చూసిన వారి డేటా.. డార్క్ వెబ్ సైట్ల చేతిలో?
నిందితులు ఎక్కడ ఉన్నా పోలీసులు పట్టుకుంటారు.
చిత్ర పరిశ్రమకు మేలు జరిగే కేసును చేధించాం.
సీపీ సజ్జనార్‌ను కలిసిన చిరంజీవి, నాగార్జున, దిల్‌రాజు, రాజమౌళి, సురేష్‌బాబు
హైదరాబాద్: టాలీవుడ్ సినీ ప్రముఖులు(Tollywood celebrities), నిర్మాతలు తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్(Telangana Police Command Control Center) లో హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిశారు. సీపీ సజ్జనార్ ను కలిసిన వారిలో నిర్మాతలు దిల్ రాజు, సురేశ్ బాబు, చిరంజీవి(Chiranjeevi), నాగార్జున, రాజమౌళి ఉన్నారు. ఈ సందర్భంగా ఐబొమ్మ నిర్వహకుడు ఇమ్మడి రవి గురించి సీపీ సజ్జనార్ కీలక విషయాలు వెల్లడించారు. సినిమాల పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ కేసులో ఇమ్మడి రవితో పాటు మరో ఇద్దరిని(శివాజీ, ప్రశాంత్) సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. చిత్ర పరిశ్రమకు మేలు జరిగే ఒక కేసును ఛేదించామని తెలిపారు. పైరసీ వల్ల చిత్రపరిశ్రమకు చాలా నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఐబొమ్మ కేసులో కీలక నిందితుడు ఇమ్మడి రవిని నిన్న అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇమ్మడి రవిపై మరో నాలుగు కేసులు నమోదై ఉన్నాయి. ఐటీ యాక్ట్, కాపీ రైట్ చట్టాల కింద కేసులున్నాయి. ఇమ్మడి రవి సమాజానికి రెండు రకాలుగా నష్టం చేశాడని సజ్జనార్((Hyderabad CP Sajjanar)) వెల్లడించారు. సినిమాల పైరసీతో చిత్రపరిశ్రమకు కోట్ల నష్టం చేశాడు, బెట్టింగ్ యాప్ లకు ప్రచారం కల్పించి మరింత నష్టం చేశాడని ఆయన వివరించారు. బెట్టింగ్ యాప్ ల వల్ల ఎంతో మంది డబ్బు, ప్రాణాలు కోల్పోయారు. పైరసీ ద్వారా ఇమ్మడి రవి రూ. 20 కోట్లు సంపాదించాడని సజ్జనార్ తెలిపారు.
సైట్ ను సందర్శించిన 50 లక్షల మంది సబ్ స్క్రైబర్ల డేటా రవి దగ్గర ఉందని, ఈ డేటా అంతా ఇలాంటి వారి వద్ద ఉండటం ప్రమాదకరమని సీపీ పేర్కొన్నారు. ఈ డేటాను అంత డార్క్ వెబ్ సైట్లకు అమ్ముకునే అవకాశముందని వివరించారు. విశాఖపట్నంకు చెందిన ఇమ్మడి రవి బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడు. కరేబియన్ దీవుల్లోని సెయింట్ నేవీ అనే దేశంలో పౌరసత్వం పొందాడు. ఇమ్మడి రవి 2019 నుంచి ఐబొమ్మ వెబ్ సైట్ ను నడుపుతున్నాడు. 110 డొమొన్లను కొనుగోలు చేసిన రవి ముఠా అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్ నుంచి సర్వర్లు నడుపుతున్నారని ఆయన వివరించారు. సీక్రెట్ కెమెరాలు, టెక్నాలజీ వాడుతూ సినిమాలు పైరసీ చేశారని తెలిపారు. టెలిగ్రామ్ ఛానెళ్ల ద్వారా సినిమాలు డేటా బదిలీ జరిగిందన్నారు. ప్రజలు కూడా ఇలాంటి పైరసీ వెబ్ సైట్లను ప్రోత్సహించవద్దని సీపీ సూచించారు. ఏపీకే ఫైల్స్ క్రియేట్ చేసి ప్రజల డేటా చోరీ చేశారని తెలిపారు. నిందితుడు ఇమ్మడి రవిని తాము సొంతంగానే పట్టుకున్నామని, ఎవరో ఇచ్చిన సమాచారంతో పట్టుకున్నామనేది అబద్ధమని మీడియాతో అన్నారు. నిందితులు ఎక్కడ ఉన్నా పోలీసులు పట్టుకుంటారని హెచ్చరించారు. తమకు సహకరించిన సినీ ప్రముఖులకు సీసీ సజ్జనార్ ధన్యవాదాలు తెలిపారు. 'నా దగ్గర 5 కోట్ల మంది ప్రజల డేటా ఉందని బెదిరించిన వారు కూడా ఉన్నారు. దమ్ముంటే పట్టుకోండని సవాలు చేసిన వారిని కూడా పట్టుకున్నాం.' అని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.