సీతారామపై సీపీఎం గుర్రు.. హామీలు అమలు చేయాలి!
- సీతమ్మసాగర్, సీతారామ ప్రాజెక్టులు
- పూర్తి చేయాలి: నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించాలి
అశ్వాపురం, ఆగస్టు 18, (విజయక్రాంతి): సీతారామ ప్రాజెక్టు, సీతమ్మసాగర్ బ్యారేజీ పనులను ఇకనైనా వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందించాలని సీపీఎం రాష్ట్ర, జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అశ్వాపురం మండలంలో మంగళవారం సీతమ్మసాగర్ బ్యారేజీ, సీతారామ ప్రాజెక్టు కాలువలు, పంప్హౌస్, మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
ప్రాజెక్టుకు అవసరమైన నిధులు కేటాయించి కాలువలు, ఫీల్ చానల్స్, చెరువులను అనుసంధానం చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరారు. సీతమ్మసాగర్ బ్యారేజీతో పాటు సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తే లక్షలాది ఎకరాలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తుమ్మలచెరువు కింద సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు. ప్రాజెక్టులపై కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పనులను పూర్తి చేసి రైతులకు ప్రయోజనం చేకూర్చాలని సీపీఎం నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శులు మచ్చ వెంకటేశ్వర్లు, నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా నాయకులు, అశ్వాపురం, మణుగూరు మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.






