19 August, 2026 | 1:35 AM

బీసీ మహిళలకు ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్

19-08-2026 12:04 AM

సెప్టెంబర్ 15లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

పెద్దపల్లి, ఆగస్టు 18 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 202627 ఆర్థిక సంవత్సరానికి ‘ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జె.రంగారెడ్డి తెలిపారు. ఈ పథకం ద్వారా బీసీ నిరుద్యోగ మహిళలకు 100 శాతం రాయితీపై రూ.12 వేల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్ను అందించనున్నట్లు వెల్లడించారు.

55 ఏళ్లలోపు బీసీ మహిళలు అర్హులు

18 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల బీసీ మహిళలు ఈ పథకానికి అర్హులని తెలిపారు. దరఖాస్తుదారులు రేషన్ కార్డు కలిగి ఉండటంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదని పేర్కొన్నారు. ప్రాథమిక అక్షరాస్యత తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.ఒక కుటుంబానికి ఒక యూనిట్ మాత్రమే మంజూరు చేస్తామని, దరఖాస్తులు అధికంగా వచ్చిన పక్షంలో కనీసం 5వ తరగతి ఉత్తీర్ణత కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. కుట్టు పనిలో నైపుణ్యం ఉన్నవారితో పాటు మేరా, మేరు సామాజిక వర్గాలకు చెందినవారు, వితంతువులు, నిరాశ్రయులు, ఒంటరి మహిళలు, అనాథలకు ప్రాధాన్యత ఉంటుందని వివరించారు.

సెప్టెంబర్ 15 వరకు అవకాశం

అర్హులైన, ఆసక్తిగల మహిళలు సెప్టెంబర్ 15లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారి సూచించారు. దరఖాస్తులను ప్రభుత్వ సంబంధిత పథకం పోర్టల్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. అనంతరం సంబంధిత ధ్రువపత్రాల పరిశీలన కోసం దరఖాస్తులను ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ లేదా జోనల్ కమిషనర్ కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు.బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జె.రంగారెడ్డి కోరారు.