calender_icon.png 18 September, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నైజాం పాలనకు మోడీ పాలనకు తేడా ఏమీ లేదు..!

18-09-2025 12:48:59 AM

మహబూబాబాద్,(విజయక్రాంతి): భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకరీ విముక్తి కోసం జరిగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని, నాడు నిజాం రాజు భూస్వాములు, జాగిర్ధాలు, పెత్తందారులు,  జమీందారులకు,  దేశముఖ్, దొరలకు వత్తాసు పలకగా నేడు ప్రధాని నరేంద్ర మోడీ కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు, బహుళ జాతి సంస్థలకు ఊడిగం చేస్తున్నారని, వారిద్దరికీ తేడా ఏమీ లేదని, తెలంగాణలో ఉన్న 25 లక్షల ఎకరాల ప్రభుత్వ పోరంబోకు, బంచరాయి భూములను పంచకుండా ప్రజాపాలన అని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అంటే ఎలా సాధ్యమవుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు.

బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ ముగింపు సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా జాన్ వెస్లీ మాట్లాడారు. దేశ చరిత్రలో  తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం స్ఫూర్తి దాయకమన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకరి విముక్తి కోసం కమ్యూనిస్టులు సభ నిర్వహిస్తుండగా, బిజెపి ఆధ్వర్యంలో మంత్రులు సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లిం ఘర్షణగా వక్రీకరిస్తున్నారని విమర్శించారు.

సాయుధ పోరాట స్ఫూర్తిని కొనసాగించడం ఎర్రజెండాకే సాధ్యమన్నారు. వెట్టి చాకిరి తట్టుకోలేక ప్రజలు కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ఎర్రజెండా పట్టుకుని తిరుగుబాటు చేశారన్నారు. సిపిఎం నేత సుందరయ్య నేతృత్వంలో ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో కమ్యూనిస్టు పార్టీలు  విసునూరు దొర గుండాలను తరిమి తరిమి కొట్టారన్నారు. అదే పోరాట స్ఫూర్తితో నేడు గ్రామ గ్రామాన ప్రజల ఉద్యమించాలన్నారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఎర్రజెండా ఉంటుందని  తెలంగాణ సాయుధ పోరాటానికి వారసులు   కమ్యూనిస్టులే అన్నారు.