11 August, 2026 | 11:36 PM

‘పగుళ్ల’ అధికారికి పదోన్నతి!

25-05-2024 03:33 AM

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, అందుకే మేడిగడ్డ బరాజ్ కుంగి పోయిందని విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు అదే మేడిగడ్డ బరాజ్ నిర్మాణ పనులు పర్యవేక్షించిన ఒక అధికారికి స్థాయికి మించిన అదనపు బాధ్యతలు అప్పగించటం చర్చనీయాంశమవుతున్నది. మేడిగడ్డ బరాజ్‌లోని 7వ బ్లాక్ గత ఏడాది కుంగిపోయింది. దానికి ఇప్పుడు రిపేర్లు చేసే పనులు కూడా మొదలుపెట్టబోతున్నారు. అయితే, ఆ ౭వ బ్లాక్ పునాది పను లను ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా దగ్గరుండి చూసుకున్న సర్దార్ ఓంకార్‌సింగ్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా వరంగల్ నీటిపారుదల సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈఈగా ఉన్న అధికారికి ఎస్‌ఈగా బాధ్యతలు అప్పగించడమంటే ప్రమోషన్ ఇచ్చినట్టేనని నీటి పారుదల శాఖలో చర్చ జరుగుతోంది.

7వ బ్లాక్ ఫౌండేషన్‌కు ఈఈగా..

7వ బ్లాక్ ఫౌండేషన్ పనులను ఓంకార్‌సింగ్ దగ్గరుండి చూసుకున్నారు. తరువాత ఆయనను అక్కడి నుంచి సుందిళ్ల బరాజ్‌కు బదిలీచేశారు. ప్రస్తుతం రామగుండం ఐడీ 3 పరిధిలో ఈఈగా పనిచేస్తున్నారు. తాజా గా ఈ నెల 22న వరంగల్ నీటిపారుదల సర్కిల్ ఎస్‌ఈగా ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (అడ్మిన్) కార్యాలయం నుంచి వచ్చిన సిఫారసులతో శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం.

సీనియర్లను పక్కనపెట్టి..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎందరో సీనియర్ అధికారులుండగా.. ఏరికోరి రామగు ండంలో పనిచేస్తున్న ఓంకార్‌సింగ్‌కు వరంగల్ నీటిపారుదల సర్కిల్ ఎస్‌ఈగా పూర్తి అదనపు బాధ్యతలు ఎందుకు అప్పగించాల్సి వచ్చిందనే చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం వరంగల్ సర్కిల్ ఎస్‌ఈగా మహ బూబాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు ఉన్నారు. ఆ స్థానంలో అకస్మాత్తుగా రామగుండం నీటిపారుదల డివి జన్ ఈఈకి ఎస్‌ఈగా బాధ్యతలు అప్పగించడంలో మతలబు ఏమిటని ఆ శాఖలో చర్చించుకుంటున్నారు. అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతోందనే చర్చ మొదలయ్యింది.

7వ బ్లాక్ గేట్లను ఎత్తేందుకు ప్రయత్నిస్తుంటే.. మరింత భారీ శబ్దాలు వచ్చినట్టు తెలుస్తోంది. కాళేశ్వరంలో అవినీతి ఆరోపణలు మొదలైందే 7వ బ్లాక్ కుంగుబాటుతో ఈ బ్లాక్‌లో నిర్మాణ లోపాల ఆధారంగానే జ్యుడీషియల్ విచారణ జరుగుతోంది. సర్దార్‌సింగ్‌కు అకస్మాత్తుగా వరంగల్ ఎస్‌ఈగా పూర్తి అదనపు బాధ్యతలను ఎందుకు అప్పగించాల్సి వచ్చిందని నిపుణులు ప్రశ్నిస్తు న్నారు. దీనిపై ఇంజినీర్ ఇన్ చీఫ్ (అడ్మిన్) అనిల్‌కుమార్‌ను వివరణ అడిగేందుకు ‘విజయక్రాంతి’ ప్రతినిధి ఫోన్‌లో ప్రయత్నిం చగా.. అయన స్పందించలేదు.