ఎందుకీ లేఔట్!?
ఆదిలాబాద్, మే 24 (విజయక్రాంతి) : ప్రతి ఒక్కరి జీవితంలో తనకంటూ ఓ సొంత ఇల్లు ఉండాలనే కల కనడం సహజం. కానీ కొందరి జీవితాల్లోనే ఆ కల సహకారం అవుతుంది. తాము కన్న కలను సాకారం చేసుకోవడానికి రూ.లక్షలు వెచ్చించినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాము కన్న సొంతింటి కల కలగానే మిగిలిపోతోందేమో అనే భయం రాజీవ్ స్వగృహ లబ్ధిదారుల్లో నెలకొంది. ఆదిలాబాద్‌కు ఆనుకొని ఉన్న మావల మండలం బట్టి సవర్గామ పంచాయతీ పరిధిలో 29 ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజీవ్ స్వగృహ సముదాయానికి లేఔట్ వేశారు. ఆ స్థలంలో కనీస వసతుల కల్పించే బాధ్యతలను టీఎస్‌ఐఐసీకి అప్పగించారు. ఒప్పందం ప్రకారం 18 నెలల్లోపు మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పినా, ఇప్పటివరకు కాంట్రాక్టర్లు చేపట్టిన పనుల్లో చాలావరకు అసంపూర్తిగా ఉన్నాయి. మరికొన్ని పనులు అసలు ప్రారంభానికే నోచుకోకపోవడం పేదవాడి ఇంటి కల కలగానే మిగిలి పోతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రూ.95 కోట్లు తెచ్చి పెట్టిన లే ఔట్
ప్రభుత్వం రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు చెందిన మావల మండలం బట్టి సావర్గాం శివారులో సర్వే నెంబర్ 72/1/2, 72/1/32లో లే ఔట్ చేసింది. దీనిలో మొత్తం 362 ప్లాట్లతోపాటు పార్కులు, ప్రజావసరాల స్థలాలు ఏర్పాటు చేశారు. చదరపు గజానికి కనీస ధర రూ.8 వేలు నిర్ణయించి, 2022 నవంబర్ 14 నుంచి 19వ తేదీ వరకు మొదటి బహిరంగ వేలం, మార్చి 17న రెండోసారి వేలం వేసి అన్ని ప్లాట్లను విక్రయించారు. కొనుగోలుదారులు పోటీపడి రూ.లక్షలు వెచ్చించి ప్లాట్లను దక్కించుకున్నారు. మొత్తానికి 360 ప్లాట్లకు దాదాపు రూ.95 కోట్ల ఆదాయం వచ్చింది.
నత్తకే నడక నేర్పేలా..
రాజీవ్ స్వగృహ లే ఔట్‌లో మౌలిక వసతుల పనులు నత్తకు నడక నేర్పేలా సాగుతున్నాయి. కొందరు లబ్ధిదారులు అప్పు చేసి, బ్యాంకుల్లో రుణాలు తీసుకుని మరీ ప్లాట్లు కొనుగోలు చేశారు. లే ఔట్‌ను త్వరగా అభివృద్ధి చేసి, మౌలిక వసతులు కల్పిస్తే ఇల్లు నిర్మించుకుందామని ఆశించిన వారికి ఏళ్లు గడుస్తున్నా కల మారదు.. కలత తీరదు అన్నట్లుగా తయారైంది. కాంట్రాక్టర్లు చేపట్టాల్సిన పనులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనులు మరింత ఆలస్యంగా సాగుతున్నాయి. ప్రధానంగా రోడ్లు, అండర్ డ్రెయినేజీ, తాగునీటి వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. విద్యుత్ సౌకర్యం పనులు అసలే ప్రారంభించకపోవడం కాంట్రాక్టర్ల అలసత్వానికి అద్దం పడుతోంది. కేవలం బీటీ రోడ్డు.. అక్కడక్కడ కల్వర్టులు నిర్మించి.. వదిలేయడం విస్మయానికి గురిచేస్తోంది.






