1 September, 2026 | 12:38 AM

సహచరి సురక్షతో మహిళల్లో చైతన్యం

01-09-2026 12:00 AM

ఉప్పల్‌లో మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన

ఉప్పల్, ఆగస్టు 31(విజయక్రాంతి) : మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఆదేశాల మేరకు ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ‘సహచరి సురక్ష’ కార్యక్రమంలో మహిళలకు భద్రత, చట్టపరమైన హక్కులు, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల్ సీఐ వై. రామలింగారెడ్డి మాట్లాడుతూ మహిళలు తమకు ఎదురయ్యే సమస్యలను నిర్భయం గా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూ చించారు.

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించి సహాయం పొందాలని తెలిపారు.సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టుల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులను నమ్మవద్దని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, పిల్లలను డ్రగ్స్కు దూరంగా ఉంచేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, తమ ప్రాంతాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మహిళలు పోలీస్ శాఖ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పొదుపు సంఘాల మహిళలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహిళల భద్రత, సైబర్ అవగాహన, డ్రగ్స్ నిర్మూలన అంశాలపై నిర్వహించిన ఈ కార్యక్రమం మహిళల్లో చైతన్యం నింపింది.