జలమండలి లోగోను వాడితే క్రిమినల్ కేసులు
- ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల మోసంపై వాటర్ బోర్డు సీరియస్
- ఒక ట్యాంకర్ సీజ్, యజమానిపై కేసు: ఎండీ అశోక్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 27 (విజయక్రాంతి): ప్రైవేట్ ట్యాంకర్లు జలమం డలి లోగోను వాడితే జైల్‌కు పంపుతామని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎండీ అశోక్‌రెడ్డి శుక్రవారం హెచ్చరించారు. జలమండలి అధికారిక లోగోను తమ ప్రైవే ట్ ట్యాంకర్లపై ముద్రించుకుని, అనధికారికంగా కలుషిత నీటిని విక్రయిస్తున్న అక్రమా ర్కులపై అధికారులు కొరడా ఝుళిపించారని తెలిపారు.
ఒక ట్యాంకర్‌ను సీజ్‌చేసి, యజమానిపై కేసు నమోదు చేశామని ఎండీ పేర్కొన్నారు. జలమండలి ద్వారా సరఫరా అయ్యే నీరు నిర్ణీత ప్రమాణాల ప్రకారం శుద్ధి చేయబడి, నాణ్యతా పరీక్షలు పూర్తి చేసుకుని సురక్షితంగా ప్రజల వద్దకు చేరుతుంది. ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు.. తమ వాహనాలకు జలమండలి అధికారిక లోగోలను వేసుకుని నీటిని విక్రయిస్తున్నారు.
వాస్తవానికి ఈ ప్రైవేట్ ట్యాంకర్లు సాధారణ బోర్‌వెళ్ల నుంచి నీటిని సేకరిస్తాయని, ఆ నీటికి ఎటువంటి శుద్ధి గానీ, నాణ్యతా పరీక్షలు గానీ జరగవని అధికారులు స్పష్టంచేశారు. కలుషితమైన, ప్రమా ణాలు లేని ఈ నీటిని తాగడం వల్ల ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసే క్రిమినల్ చర్యగా వాటర్ బోర్డు పరిగణిస్తోంది. ప్రైవేట్ ట్యాంకర్ల ఆగడాలపై జలమండలి ఎండీ తీవ్రంగా స్పందించారు. నగరవ్యాప్తంగా అధికారులను అప్రమత్తం చేశారు.




