12 March, 2026 | 9:20 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

అశ్వారావుపేటలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన

12-03-2026 05:11 PM

ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ 

అశ్వారావుపేట,(విజయక్రాంతి): అశ్వారావుపేట పట్టణంలో మారకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులు, యువతకు మారకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై వివరించారు.

ఈ కార్యక్రమంలో ఈగల్ ఫోర్స్ డీఎస్పీ బుచ్చయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా యువతలో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్నది ఆందోళనకరమని అన్నారు. ఒకసారి డ్రగ్స్ అలవాటు పడితే ఆ అలవాటును విడిచిపెట్టడం చాలా కష్టమవుతుందని, మొదట వినోదం లేదా ఒత్తిడి తగ్గించుకోవడం కోసం తీసుకునే డ్రగ్స్ తరువాత జీవితాన్ని పూర్తిగా నాశనం చేసే స్థాయికి తీసుకెళ్తాయని ఆయన హెచ్చరించారు.

డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తి మొదట కుటుంబ సభ్యులు, స్నేహితుల నుండి దూరమవుతాడని, తరువాత మానసికంగా, శారీరకంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటాడని వివరించారు. అలాంటి అలవాట్లు పెరుగుతూ పోతే చదువు, ఉద్యోగం, కుటుంబ జీవితం అన్నీ దెబ్బతింటాయని, చివరికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని దొంగతనాలు, నేరాలకు పాల్పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన తెలిపారు. డ్రగ్స్ సేవించడం వలన వ్యక్తి విచక్షణ కోల్పోయి అనాలోచిత చర్యలకు పాల్పడే ప్రమాదం ఉందని, కొన్నిసార్లు హత్యలు, ఆత్మహత్యలు వంటి తీవ్రమైన సంఘటనలకు కూడా దారి తీస్తున్నాయని డీఎస్పీ బుచ్చయ్య విద్యార్థులకు వివరించారు. అందుకే యువత ముందుగానే అప్రమత్తంగా ఉండి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా సబ్ ఇన్‌స్పెక్టర్ యయాతి రాజ్ మాట్లాడుతూ, కొంతమంది ధనికులు మరియు సినీ రంగానికి చెందిన వ్యక్తులు తమ ఒత్తిడిని తగ్గించుకోవడానికి స్వల్పంగా డ్రగ్స్ వినియోగించడం ప్రారంభించారని, అదే తరువాత మహమ్మారి లా మారి సమాజంలో వ్యాప్తి చెందుతోందని తెలిపారు. ఈ అలవాటు పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా పల్లెలకు కూడా చేరుకుని కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించిన వెంటనే వారిని సరిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం ఈగల్ ఫోర్స్ అధికారులు, అశ్వారావుపేట పోలీసులు, ఎక్సైజ్ రెవెన్యూ శాఖ సిబ్బంది, స్థానిక ప్రజలు, విద్యార్థులు కలిసి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వ్యతిరేక ప్లకార్డులు పట్టుకుని “డ్రగ్స్‌కు నో చెప్పండి”, “యువతే దేశ భవిష్యత్తు”, “డ్రగ్స్‌కు దూరంగా ఉండండి – ఆరోగ్యంగా జీవించండి” వంటి నినాదాలు చేస్తూ ర్యాలీ సాగింది.

ర్యాలీ అనంతరం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ కూడలి వద్ద విద్యార్థులు, అధికారులు కలిసి మానవహారం ఏర్పాటుచేసి డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఫోర్స్ డీఎస్పీ బుచ్చయ్య, సబ్ ఇన్‌స్పెక్టర్ యయాతి రాజ్, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.