పంట బీమా సౌకర్యం కల్పించాలి
పచ్చిరొట్ట విత్తనాలపై సబ్సిడీకి విధివిధానాలు రూపొందించాలి
వరికొయ్యలు కాల్చకుండా రైతులకు అవగాహన కల్పించాలి
అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశాలు
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): ఖరీప్ నుంచి అమలు అయ్యే పంటల బీమా విధివిధినాలపై అధికారులు ప్లాన్ చేయాలని, టెండర్ల నిబంధనల ప్రకారం ముందుకు వచ్చే కంపెనీల అర్హతలు పరిశీలించి రైతులు పంట నష్టపోయినప్పుడు వారిని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. గురువారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పథకం అమలుకు ఆదర్శ రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై సరఫరాకు విధివిధానాలను రూపొందించి వెంటనే సరఫరా ప్రారంభించాలన్నారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని టీఎస్ సీడ్స్ అధికారులకు ఆదేశించారు. మొదటి విడుత పంటనష్టం పరిహారం రూ.15 కోట్లు పంపిణీ పూర్తిచేశామని, రెండో విడుత ఏప్రిల్ మాసంలో, మూడో విడుత మే నెలలో జరిగిన నష్టంపై వివరాల అందజేయాలన్నారు.
మట్టి నమూనా పరీక్షాకేంద్రాల సామర్థ్యం అనుసరించి, అవసరం ఉన్న రైతుల పొలాల మట్టి నమూనాల సేకరించి ఫలితాలు వచ్చే నెలాఖరులోగా అందజేసేందుకు ప్రణాళికలు చేసుకోవాలని పేర్కొన్నారు. వరికొయ్యలు కాల్చకుండా యుద్ధప్రతిపాదికన రైతులకు అవగాహన కల్పించడం, అప్పటికీ వినకపోతే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ జరిమానాలు విధిస్తామని హెచ్చరించాలని తెలిపారు. మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు కొనుగోళ్లను వేగవంతం చేసి ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు.
ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఆధునిక సాంకేతికతతో పండ్లతోటల పెంపు, నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలన్నారు. ఆయిల్ ఫాం కంపెనీల పనితీరు ఆధారంగా చర్యలు తీసుకోవాలని, మల్బరీ సాగుకు అనుకూల ప్రాంతాలను ఎంపిక చేసి పట్టు పరిశ్రమ అభివృద్దికి కృషి చేయాలని చెప్పారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో మ్యాచింగ్ గ్రాంటు బకాయి నిధుల విడుదలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అన్నిరకాల సహకార సంఘాల్లో సభ్యుల గుర్తింపు, పదవీకాలం ముగిసిన సంఘాల ఎన్నికల నిర్వహణకు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.




