రేపు బొగ్గు గనుల వేలం
- 60 గనులను హైదరాబాద్‌లో అర్రాజు వేయనున్న కేంద్రం
జాబితాలో రాష్ట్రానికి చెందిన శ్రావణపల్లి మైన్
హాజరుకానున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి
తొలిసారి వేలంలో పాల్గొంటున్న సింగరేణి
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): దేశీయ బొగ్గు ఉత్పత్తిని పెంచడం, పారదర్శకత, పోటీతత్వాన్ని పెంపొందించడం, స్థిరత్వాన్ని సాధించడం, ఇంధన భద్రతకు భరోసాను ఇచ్చే లక్ష్యంతో 10వ విడత వాణిజ్య గనుల వేలానికి కేంద్రం సిద్ధమైంది. కేంద్ర గనుల మంత్రి కిషన్‌రెడ్డి సారథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క సమక్షంలో హైదరాబాద్ వేదికగా శుక్రవారం ఈ అర్రాజు జరగ నుంది.
మొత్తం 60 గనులకు వేలంపాట నిర్వహించనుండగా తెలంగా ణలో బెల్లంపల్లిలోని శ్రావణపల్లి మైన్ కూడా వేలం నిర్వహించే జాబితాలో కేంద్రం చేర్చింది. 60 బొగ్గు బ్లాకుల్లో కొన్ని కోకింగ్, మరికొన్ని నాన్ కోకింగ్ గనులు ఉన్నాయి. వీటిలో 24 గనులను మైనింగ్‌శాఖ పూర్తిగా అన్వేషిం చగా 36 గనులను పాక్షికంగా అన్వేషించారు. కొత్త గనుల్లో ఉత్పత్తి ద్వారా ఆర్థికాభివృద్ధితో పాటు ఉపాధి కల్పన జరుతుందని కేంద్రం ఆశిస్తోంది. నూతన బ్లాకుల్లో బొగ్గు ఉత్పత్తికి పర్యావరణ పద్ధతులను కూడా అవలంబిస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే 9వ విడత వేలంలో మిగిలిపోయిన ఐదు గనులు, 8వ వేలంలో అమ్ముడుపోని రెండు బ్లాక్‌లకు కూడా శుక్రవారమే విక్రయిస్తామని కేంద్రం చెప్పింది.
ఖనిజ చట్టాల్లో సవరణలు..
బొగ్గు అమ్మకం, వినియోగానికి సంబంధించిన పరిమితులను కేంద్రం తొలగించింది. దీంతో ఎవరైనా వేలంలో పాల్గొనవచ్చని చెప్పింది. ఖనిజ చట్టాల్లో సవరణ అనేది బొగ్గు రంగానికి స్వేచ్ఛను కల్పిస్తుందని కేంద్రం అభిప్రాయపడింది. ఈ సవరణ ద్వారా అమ్మకం, వినియోగంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు సమానమైన అవకాశాలు, ప్రయోజనాలు కలుగుతాయని కేంద్రం చెప్పు కొచ్చింది. ఇదే సమయంలో బొగ్గు గనుల నిర్వహణలో పారదర్శకత కోసం సంబంధిత మంత్రిత్వ శాఖ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ పోర్టల్‌ను తీసుకొచ్చింది. పారదర్శకత కారణంగా దేశం లో బొగ్గు ఉత్పత్తి వృద్ధి సాధిస్తుందని కేంద్రం ఆశిస్తోంది. తద్వారా ఇంధన రంగంలో నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడానికి సహాయపడుతుందని కేంద్రం అభిప్రాయపడింది.
తొలిసారి వేలంలో సింగరేణి..
సింగరేణి సంస్థ తొలిసారి శ్రావణపల్లి గని కోసం వేలంలో పాల్గొంటోంది. గతంలో ఎన్నడూ సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనలేదు. ఇది వరకు తెలంగాణకు సంబంధించిన కోయగూడెం, సత్తుపల్లి గనులకు కేంద్రం వేలం నిర్వహించింది. ఈ సమయాల్లో వేలంతో సంబంధం లేకుండా నేరుగా తమకు గనులను కేటాయించాలని సింగరేణి కేంద్రాన్ని కోరింది. కానీ కేంద్రం ఒప్పుకోలేదు. దీంతో ఆ రెండు గనులు ప్రైవేటు సంస్థలు దక్కించుకున్నాయి. దాదాపు 20 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్న ఈ రెండు గనులు దూరం కావడంతో సింగరేణికి కష్టాలు మొదలయ్యాయి. ఉత్పత్తి పెరగక అంతర్గతంగా అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంది. దీంతో బెల్లంపల్లిలోని శ్రావణపల్లి గని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తోంది. శ్రావణపల్లి గనిలో దాదాపు రూ.11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. ఇది సంస్థ పురోగమనానికి దోహదపడుతుందని సింగరేణి భావిస్తోంది.
బీఆర్‌ఎస్ నిర్వాకంతో చేజారిన రెండు గనులు!
వాస్తవానికి కోయగూడెం, సత్తుపల్లి3గనుల వేలంలో పాల్గొనడానికి సింగరేణి ఆసక్తిని కనబర్చినా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డుపుల్ల వేసినట్లు సమాచారం. రాష్ట్రంలో కొత్త గనులు ప్రారంభమైతే బొగ్గు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంలో 4 శాతం రాయల్టీ కింద ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రైవేటు సంస్థలు 20 నుంచి 30 శాతం వరకు రాయల్టీ చెల్లిస్తామని చెప్పడంతో సింగరేణి సంస్థ బిడ్డింగ్‌లో పాల్గొనకుండా నాటి బీఆర్‌ఎస్ సర్కారు మౌఖిక ఆదేశాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫలితంగా సింగరేణి 20 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్న గనులను కోల్పోవాల్సి వచ్చింది.






