కాంగ్రెస్‌కు క్రాస్‌ఓటింగ్ దెబ్బ
కమల వికాసానికి గులాబీ నేతల మద్దతు
చాలా స్థానాల్లో రెండు పార్టీల పరస్పర సహకారం
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన పలు నియోజకవర్గాల్లో క్రాస్‌ఓటింగ్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఓడిపోయే స్థానాలను గుర్తించిన పార్టీ సీనియర్లు అక్కడ తమకు అనుకూలమైన అభ్యర్థులకు లోపాయికారీ ఒప్పందంతో ఓట్లు వేయించినట్లు తెలిసింది. ఈ ఓటు బదిలీ బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ప్లాన్ చేసినట్లు మండల స్థాయి నాయకులు చెబుతున్నారు. పార్టీ నిర్వహించిన సర్వేలో మూడో స్థానంలో ఉన్న అభ్యర్థులను బీఆర్‌ఎస్ గుర్తించి అక్కడ కమలం పార్టీ అభ్యర్థులకు సహకారం అందించాలనే సిగ్నల్ ఇవ్వడంతో ఒక రోజు ముందే తతంగం జరిగినట్లు చర్చ జరగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చవిచూసిన తరువాత పలువురు కాషాయం కండువా కప్పుకుని ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. వారికి బీఆర్‌ఎస్ క్యాడర్ పరిచయం ఉండటంతో మీ అభ్యర్థి వెనుకంజలో ఉన్నాడని, తనకు సహకారం అందిస్తే కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించవచ్చని ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో మండల, డివిజన్ స్థాయి నాయకులు వారి గెలుపుకు మద్దతు పలికినట్లు అనుచరులు పేర్కొంటున్నారు. భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌కు ఆ నియోజకవర్గం బీఆర్‌ఎస్ నేతలంతా టచ్‌లో ఉన్నారు.
బీఆర్‌ఎస్ నుంచి క్యామ మల్లేశ్ నామమాత్రంగా పోటీ చేయడంతో నర్సయ్యగౌడ్‌కు మద్దతు పలికారు. వరంగల్ నుంచి బీజేపీ తరుఫున ఆరూరి రమేశ్ పోటీ చేయగా, బీఆర్‌ఎస్ నుంచి సుధీర్‌కుమార్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి కడియం శ్రీహరి కూతురు కావ్య తలపడింది. బీఆర్‌ఎస్‌ను మోసం చేసిన కావ్యను ఓడించేందుకు స్థానిక నేతలు తమ పార్టీ పాత నాయకుడు ఆరూరికి సహకారం అందించినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరిగింది. చేవెళ్లలో కూడా బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపుకు అవకాశాలు తక్కువగా ఉండటంతో అక్కడ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతు ఇచ్చినట్లు రాజేంద్రనగర్‌కు చెందిన పలు కార్పొరేటర్లు పేర్కొంటున్నారు. ఆయన గతంలో ఎంపీగా ఉన్నప్పుడు తమకు అన్నివిధాల సహకారం అందించారని, బీఆర్‌ఎస్‌కు నమ్మకద్రోహం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డికి గుణపాఠం చెబుతామన్నారు. అదే విధంగా జహీరాబాద్‌లో కూడా గులాబీ అభ్యర్థి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకంటే వెనుకంజలో ఉండటంతో తమ పార్టీ నుంచి రెండు సార్లు ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన బీబీ పాటిల్‌కు సహకరిస్తే విజయం సాధిస్తారని భావించి మద్దతిచ్చారు. ఆదిలాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపుపై ఆశలు తక్కువగా ఉండటంతో బీజేపీ నుంచి పోటీ చేసిన గోడం నగేశ్‌కు గులాబీ నేతలు సహకారం అందించారు.
గులాబీలకు కమలాల మద్దతు
కమలం పార్టీ అభ్యర్థులు మూడో స్థానంలో ఉన్న చోట గులాబీ పార్టీ అభ్యర్థులకు గెలుపుకు సహకరించినట్లు పార్టీ జిల్లా నాయకులు పేర్కొంటున్నారు. నల్లగొండ, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో తోడ్పాటు అందించినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు చెప్పాయి. నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేయగా, అక్కడ బీఆర్‌ఎస్‌కు బలమైన క్యాడర్ ఉంది. బీజేపీ అంతంతమాత్రంగానే ఉండటంతో జానారెడ్డి కుమారుడు రఘవీర్‌ను ఓడించేందుకు కమలం, గులాబీ నేతలు చేతులు కలిపారు. వీరికి కొందరు కాంగ్రెస్ సీనియర్ల అండ ఉండటంతో కంచర్లకు బీజేపీ ఓట్లు పడినట్లు జిల్లాలో జోరుగా ప్రచారం నడుస్తోంది. నాగర్‌కర్నూల్ నుంచి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ నిలబడగా బీజేపీ నుంచి పోతుగంటి భరత్‌ప్రసాద్ పోటీ చేశారు. ఈ ఇద్దరు నాయకులు ఒకటై స్థానికేతరుడైన కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని ఓడించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
మహబూబాబాద్ స్థానంలో బీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపి మాలోత్ కవిత పోటీ చేయగా, బీజేపీ నుంచి సీతారాంనాయక్ నిలబడ్డారు. కాంగ్రెస్ నుంచి కేంద్రమాజీ మంత్రి బలరాంనాయక్ తలపడుతున్నారు. ఇక్కడ బీజేపీకి పెద్దగా బలం లేకపోవడంతో అన్ని గ్రామాల్లో క్యాడర్ ఉండటంతో పాటు కాంగ్రెస్‌కు దీటుగా కవిత పోటీ ఇస్తుండటంతో కమలనాథులు ఆమెను గెలిపించి హస్తం పార్టీ ఓడించాలనే నిర్ణయంతో ఒకటైనట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అదే విధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పోటీ రసవత్తరంగా సాగింది. అక్కడ బీజేపీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోవడంతో గడ్డం వంశీని ఓడించేందుకు కమలనాథులు కొప్పలు ఈశ్వర్ గెలవడమే ఉత్తమమని భావించి ఆయన గెలుపుకు మద్దతు పలికినట్లు బిఆర్‌ఎస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ఇలా పరస్పర సహకారంతో కాంగ్రెస్ గెలిచే పలు నియోజకవర్గాలపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.




