22-07-2025 01:20:56 PM
భయాందోళనలో రైతులు గ్రామస్తులు
పాదముద్రలను బట్టి హైనా లేదా నక్క అంటున్న ఫారెస్ట్ అధికారులు
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని పడమటి వారి గూడెం గ్రామంలోని పత్తి చేలల్లో గత రెండు రోజులుగా గుర్తు తెలియని జంతువు పాదముద్రలు కనిపిస్తుండడంతో అవి పులివా లేదా చిరుత పులివా లేదా మరి ఇతరైన క్రూర జంతువా అని రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అయితే పత్తి చేలలో కనిపించిన పాదముద్రల గురించి రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారాన్ని అందించారు. కాగా మంగళవారం ఫారెస్ట్ అధికారులు పాదముద్రలు ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా పాదముద్రల కొలతలు, పాదముద్రల సైజు, వాటి గోర్ల ముద్రలు పలు ప్రాంతాల్లో పరిశీలించారు. కాగా పాదముద్రలు, గోర్ల ముద్రలను పరిశీలించినట్లయితే అవి హైనా లేదా నక్కకు సంబంధించినవని అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి ఫారెస్ట్ అధికారులు అవి పులివి లేదా చిరుతపులివి కాదని తెలియజేసినప్పటికీ పాదముద్రలు ఉన్నటువంటి జంతువు కనిపించకపోవడంతో రైతులు వ్యవసాయ కూలీలు గ్రామస్తులు కొంత ఆందోళన కలిగి ఉన్నారు.