09-05-2025 12:43:38 AM
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): పరిపాలనా విభాగ కొత్త బాస్ దూకుడుగా పని చేస్తున్నారు. అధికారులనూ పరుగులు పెట్టిస్తున్నారు. మాజీ సీఎస్ శాంతికుమారి పదవీ విరమణ చేయడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన కే రామకృ ష్ణారావు వారంలోనే తనదైన మార్క్ పాలన చూపిస్తున్నారు. మొదట తెలంగాణకు ఆయువుపట్టు వంటి హైదరాబాద్ అభివృద్ధిపై ప్రధానంగా దృష్టిసారించారు.
అందులో భాగంగా ఇటీవల హైదరాబాద్ పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయా శాఖల అధికారులతో కలిసి పరి శీలిస్తున్నారు. మెట్రో విస్తరణ పనులు, నగరంలోని రోడ్డు మరమ్మతు పనులు వంటి వాటిని త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వేసవి నేప థ్యంలో మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులు ఏర్పాటు చేసిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆక స్మికంగా జాయిన్ అయ్యి అధికారులను ఆశ్చర్యపరిచారు.
పదవీకాలం నాలుగు నెలలే..
మే 1వ తేదీన తెలంగాణ ప్రభుత్వ ప్రధా న కార్యదర్శిగా కే రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టుతో రామకృష్ణారావు పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో సీఎస్ పదవీకాలం ప్రస్తుతానికి కేవలం నాలుగు నెలలే. అయితే ప్రధాన కార్యదర్శి రేసులో సీనియర్ ఐఏఎస్ అధికారులు జయేశ్ రంజన్, వికాస్‌రాజ్ వంటి వారు ఉన్నప్పటికీ రామకృ ష్ణారావునే ఆ పదవి వరించింది.
సీఎస్ పదవీకి పోటీ గట్టిగానే ఉన్నా, రామకృష్ణారావు పదవీకాలం నాలుగు నెలలే ఉన్నా సీఎం రేవంత్‌రెడ్డి ఆయననే ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఆయనపై సీఎం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా రామకృష్ణారావు పనితీరు కనబరుస్తున్నారు. అన్ని విభాగాల పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పనులను వేగవంతం చేస్తున్నారు. వాస్తవానికి సీఎస్‌ను ఎంపిక చేసే క్రమంలో సీనియారిటీతో పాటు ఎక్కువకాలం పదవిలో కొనసాగే అవకాశం ఉన్న అధికారినే ప్రభుత్వం ఎంచుకుంటుంది. కానీ రామకృష్ణారావు ఎంపిక మాత్రం దానికి భిన్నంగా జరిగింది.
మరో ఆరు నెలల పొడగింపు?
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావును సీఎం రేవంత్‌రెడ్డి ఎంపిక చేయడం వెనుక బలమైన కారణమే ఉందని తెలుస్తోం ది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి రామకృష్ణారావు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచే స్తున్నారు. సుదీర్ఘకాలం ఆర్థికశాఖలో పనిచేసిన అనుభవం ఉండటంతో ఆయనకు రాష్ట్ర బడ్జెట్‌పై పూర్తి పట్టు ఉంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని పరిపాలనను సమర్థవంతం చేసే సామర్థ్యం రామకృష్ణారావుకు ఉందని సీఎం రేవంత్‌రెడ్డి నమ్మకం పెట్టుకున్నట్టు సమాచారం. అయితే ఈ ఏడాది ఆగస్టుతో రామకృష్ణారావు పదవీ కాలం ముగుస్తుంది. కేంద్రంతో మాట్లాడి ఆయన సర్వీసును మరో ఆరు నెలలు పొడగించే యోచనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది.