30-07-2025 12:00:00 AM
గోదావరిఖనిలో వ్యాపారులను రూ.10 లక్షలు ఇవ్వాలంటూ
ఫోన్‌లో బెదిరించి... పోలీసులకు పట్టుబడిన వ్యక్తి
గోదావరిఖని, జూలై 29(విజయ క్రాంతి): డామిట్ కథ అడ్డం తిరిగింది... సులువుగా డబ్బులు సంపాదించాలని... సినిమా పక్కిలో... గోదావరిఖనిలోని పలువురు బడా వ్యాపారులకు ఫోన్ చేసి 10 లక్షలు పంపించాలంటూ బెదిరించిన సంఘటన బెడిసి కొట్టి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ మేరకు మంగళవారం గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ ఇంద్రసేనారెడ్డి సంఘటన వివరాలు వెల్లడించారు.
ఈనెల 18 న ఒక వ్యక్తి కళ్యాణ్ నగర్ కు చెందిన ఇద్దరు వ్యాపారస్థులకు ఫోను చేసి ఒక్కొక్కరు తలా పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ లేనిచో వారి కుటుంబ సభ్యులకు హాని చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినాడు. గత కొంత కాలం క్రితం గోదావరిఖని చౌరస్తాలో ఒక వ్యక్తిని మర్డర్ చేసింది నేనేనంటూ అదే పరిస్థితి నీ ఫ్యామిలీకి కూడా పడుతుందని సదరు వ్యక్తులను బెదిరించాడు.
ఆ బెది రింపులతో భయపడిపోయిన వ్యాపారస్తులు ప్రాణభయంతో భయాందోళన గురై 22న ధైర్యం చేసి ఒక వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ ఇంద్రసేనారెడ్డి ఆదేశాల మేరకు ఎస్త్స్ర కె. రమేష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
బెదిరించిన వ్యక్తి ఫోన్ నెంబర్ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గోదావరిఖని పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అతనిని *గోదావరిఖని చంద్రశేఖర్ నగర్ కి చెందిన యాదనవేని తిరుపతి గా గుర్తించి ఈరోజు అరెస్టు చేసి అతని వద్ద బెదిరింపులకు పాల్పడడానికి ఉపయోగించిన ఫోన్ ను స్వాధీన పరుచుకొని రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు చేసిన ఎవరిని ఉపేక్షించేది లేదని సీఐ హెచ్చరించినారు. సమావేశంలో ఎస్త్స్ర కె. రమేష్, సిబ్బందిఉన్నారు.