తెలంగాణ ధిక్కార స్వరం కాళోజీ
- సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ
- కాళోజీ కళాక్షేత్రంను సందర్శించిన సీపీఐ నేత నారాయణ
హనుమకొండ (మహబూబాబాద్) ఆగస్టు 14 (విజయక్రాంతి) : తెలంగాణ గొంతుకై నిలిచిన ప్రజాకవి, ధిక్కార స్వరం కాళోజీ అని, దోపిడి చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతం, ప్రాంతం వాడే దోపిడి చేస్తే పాతర వేస్తం అనే కాళోజీ కవితలను నిజం చేసి పాలకుల పని తీరును గమనించి అధికార మార్పిడి చేసిన తెలంగాణ ప్రజలని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ అన్నారు.
శుక్రవారం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంను సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కాళోజీ దుస్తులను, వారు రాసిన కవితల పుస్తకాలను, కళా కళాక్షేత్రంను పరిశీలించి, కాళోజీ విగ్రహం కు శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఆగస్టు 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు కేంద్ర బిజెపి ప్రభుత్వంకు వ్యతిరేకంగా సిపిఐ పాదయాత్రలు చేస్తుందని, శుక్రవారం వరంగల్ సిపిఐ పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి రావడం జరిగిందని తెలిపారు.
కాళోజీ కళాక్షేత్రం ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారకంగా హనుమకొండ (వరంగల్ ట్రై సిటీ ప్రాంతం)లో నిర్మించిన బహుళ ప్రయోజన సాంస్కృతిక కేంద్రమన్నారు. తాను వరంగల్ వచ్చిన సందర్భంగా కాళోజీ కళాక్షేత్రను చూడాలని అనిపించిందని తెలుపుతూ 2014 సంవత్సరంలో కాళోజీ ఆడిటోరియంకు శిలాఫలకం వేసినప్పుడు తాను రావడం జరిగిందని గుర్తుచేశారు. అప్పుడు కేసీఆర్ పునాది వేసి నత్తనడకన కూడా దీనిని పూర్తి చేయలేక పోయాడని 2024 కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటుతో 2014 అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలను మరిచిపోవడం, ముఖ్యంగా తెలంగాణ కవుల్లో ముఖ్యుడైన కాళోజీ నారాయణ రావు కళాక్షేత్రంకు శిలాఫలకం వేసి మరిచిపోవడం దారుణమని, ప్రజాకంఠక పాలన కొనసాగించడం ద్వారా అధికారం కోల్పోవడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కళాక్షేత్రంను ప్రారంభించడం జరిగిందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యులు మేకల రవి, పంజాల రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ ఎ స్టాలిన్, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకులు ల్యాదల్ల శరత్ తదితరులు పాల్గొన్నారు.






