6 April, 2026 | 3:54 AM

హైదరాబాద్‌లో చీకటి మేఘాలు

02-12-2024 10:33 AM

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. డిసెంబర్ 5 వరకు హైదరాబాద్‌లో తేలికపాటి వర్షం లేదా చినుకులు పడే అవకాశముందని సూచించింది. హైదరాబాద్ లో శనివారం రాత్రి నుంచి వాతావారణం చల్లగా ఉంది. ఆదివారం నగరంలోని పలు ప్రాంతాలో జోరుగా వాన కురిసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌లో వర్షపాతం, తెలంగాణకు హెచ్చరికలు 

తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ సహా పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. నిన్న తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 55.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో అత్యధికంగా 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు.

తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల మధ్య రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 18.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. హైదరాబాద్‌లోని షేక్‌పేట ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రత 21.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. నేటి వర్షాలతో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.