calender_icon.png 7 October, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దినదిన గండంగా.. బతుకు బండి! ఆటోవాలాను ఆదుకోరా?

07-10-2025 02:06:21 AM

రోజంతా కష్టపడినా పూట గడవని దయనీయ స్థితి

  1. ఏపీ తరహాలోనే ఆర్థికంగా ఆదుకోవాలి
  2. రాష్ట్ర ప్రభుత్వానికి ఆటో డ్రైవర్ల విజ్ఞప్తి

* ప్రభుత్వం మా సమస్యలను  నిర్లక్ష్యం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పండుగల సమయంలో ఆర్థిక సహా యం పంపిణీ చేస్తుండగా, తెలంగాణలో మాత్రం ఆటో డ్రైవర్లు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు వాగ్దానం చేసిన సహాయంలో రూ. 1,000 కోట్లకు పైగా బాకీ ఉంది. తక్షణ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతాం.

ఆటో యూనియన్ల నాయకులు

హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమంలో భాగంగా వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే మహిళలకు లబ్ధి చేకూర్చే ఉచిత బస్సు పథకం.. పరోక్షంగా ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీసింది. ప్రయాణానికి ఆటోలను వినియోగించే మహిళలు.. ఉచి తం కావడంతో బస్సు ప్రయాణానికే మొగ్గు చూపుతు న్నారు.

దీంతో రోజంతా కష్టపడినా పూట గడవని దయ నీయ స్థితిలో ఆటో డ్రైవర్లు బతుకులు వెళ్లదీస్తున్నారు. వాస్తవానికి ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో డ్రైవ ర్లకు నష్టం కలుగుతుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏడాదికి రూ. 12,000 అందిస్తామని హామీ కూడా ఇచ్చింది. కానీ ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఉచిత బస్సు ప్రయాణ విధానంతో దెబ్బ తిన్న ఆటో డ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సంవత్స రానికి రూ.15,000 అందిస్తున్నది.

దీంతో ఆటో డ్రైవర్లకు అండగా నిలవడంలో ఏపీని ఆదర్శంగా తీసుకుని తమ జీవనోపాధిని కాపాడుకోవడానికి వార్షిక ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ ఆటో డ్రైవర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది కుటుం బాలు మనుగడ కోసం పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వ హామీ మాత్రం ఇప్పటికీ కాగితాలకే పరిమితమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.12,000 వార్షిక సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని తెలంగాణలోని యూనియన్లు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. 

సంక్షోభంలో ఆటో డ్రైవర్ల జీవితాలు... 

‘తెలంగాణ ప్రభుత్వం వాగ్దానం చేసిన ఆర్థిక సహాయాన్ని వీలైనంత త్వరగా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.- ఆర్థిక సహాయం లేకుండా వేలాది మంది డ్రైవర్లకు మనుగడ అసాధ్యంగా మారింది’ అని తెలంగాణ ఆటో డ్రైవర్, కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఆటో యూనియన్ల జేఏసీ కన్వీనర్ బండారపు వెంకటేశం వాపోతున్నారు. ‘మా ఆదాయాలు పడిపోయాయి, అప్పులు పెరుగుతున్నాయి, పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది.’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ అంతటా ఆటో డ్రైవర్లు జీవనోపాధికి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి తీసుకురావడంతో పాటు.., ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ రైడ్- హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌ల ఆధిపత్యం వల్ల అటోవాలాల రోజువారీ ఆదాయం తగ్గింది. చాలా మందిని పేదరికంలోకి నెట్టింది. ఈ నష్టాలను పూడ్చడానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఉపశమనం ప్రవేశపెట్టినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మాత్రం ఇంకా నెరవేరలేదు.

హైదరాబాద్‌లో 3 లక్షలకు పైగా ఆటో డ్రైవర్లు, తెలంగాణ అంతటా 10 లక్షలకు పైగా- అంటే దాదాపు 25 లక్షల మంది ఈ వృత్తిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్నారు. రాష్ర్ట రవాణా నెట్‌వర్క్‌లో వారిది కీలక పాత్ర అయినప్పటికీ, వారికి ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సంక్షేమ పథకాలేవి అందుబాటులో లేవు. పరిస్థితిని మరింత దిగజార్చే విధంగా ఇంధన ధరలు, జీవన వ్యయం విపరీతంగా పెరిగినప్పటికీ, ఛార్జీలు మాత్రం ఇప్పటికీ కనీసం రూ. 20, కిలోమీటరుకు రూ. 12 గానీ ఉంది. చాలా మంది డ్రైవర్లు ఇప్పుడు నెలకు రూ. 15,000 నుంచి రూ. 20,000 మాత్రమే సంపాదిస్తున్నారు.

ఇంటి కిరాయి, కిరాణా సామాగ్రి, పిల్లల పాఠశాల ఫీజులు వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి కూడా వారి ఆదాయం సరిపోవడం లేదు. వాహనాలను అద్దెకు తీసుకునే వారు మరింత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు ఆటోకు కిరాయి చెల్లిస్తున్నారు.  ఈ గణాంకాలన్నీ ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సంక్షోభం స్థాయిని వెల్లడిస్తున్నాయి. 

ప్రత్యేక యాప్ అవసరం... 

‘మేము రోజుకు 10 నుండి 12 గంటలు పని చేస్తాం, కానీ ఇప్పటికీ మా జీవితాలు మారాలేదు’ అని ఆటో డ్రైవర్ వెంకటేశం చెబుతున్నారు. ప్రభుత్వం నిర్వహించే రైడ్-బుకింగ్ అప్లికేషన్ వారి భారాన్ని గణనీయంగా తగ్గించగలదని కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. ప్రతి రైడ్‌లో 40 శాతం వరకు కమీషన్ వసూలు చేసే ప్రైవేట్ యాప్‌ల మాదిరిగా కాకుండా, రాష్ర్ట నిర్వహణ ప్లాట్‌ఫామ్ డ్రైవర్లు తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని మిగుల్చుకోవడానికి, ప్రభుత్వం ఈ రంగాన్ని మరింత సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడటానికి ఉపయోగపడుతుంది.

మాజీ మంత్రి కేటీఆర్ ఇలాంటి ప్రణాళికను ప్రతిపాదించగా, రాష్ట్ర ప్రభుత్వం దానిని పునరుద్ధరించేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో ఆవేదన చెందుతున్న ఆటో డ్రైవర్లలో ఆగ్రహం పెరిగిపోతున్నది. అయితే ఆటో డ్రైవర్ల దుస్థితిపై సికింద్రాబాద్‌లోని భారతీయ మజ్దూర్ సంఫ్‌ు (బీఎంఎస్) ఇన్‌ఛార్జ్ శ్రీధర్ స్పందిస్తూ... ఉచిత బస్సు పథకం, యాప్ ఆధారిత సేవలకు ముందు, డ్రైవర్లు రోజుకు రూ.2,500 నుంచి రూ.3,000 సంపాదించారని గుర్తు చేశారు. ఇప్పుడు, రూ.1,000 సంపాదన కూడా చాలా కష్టతరంగా మారిందని, రూ.12,000 సహాయాన్ని వెంటనే అమలు చేయాలని, రైడ్- హెయిలింగ్ కంపెనీలు వసూలు చేసే కమీషన్లను పరిమితం చేయాలని రవాణా మంత్రి పొన్నంకు ఆయన విజ్ఞప్తి చేశారు. 

ఆత్మహత్యలకు దారితీస్తున్న పరిణామాలు... 

‘ఆరేళ్లుగా ఈ వృత్తిలోనే కష్టపడుతున్నా ప్రస్తుతం రోజుకు కనీసం రూ. 1000 సంపాదించడం కూడా కష్టమైపోయింది. ఈ సంపాదన- నా కుటుంబాన్ని పోషించడానికి సరిపోవడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు అక్కడి ప్రభుత్వం ముందడుగు వేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ఆటోడ్రైవర్లను విస్మరించిందని’ లోతుకుంటకు చెందిన ఆటో డ్రైవర్ జేమ్స్ తన ఆవేదనను పంచుకున్నారు.

ప్రస్తుతం ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి విషాదకరంగా, ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్నది. 198 మంది ఆటో డ్రైవర్లు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారని, మరికొందరు ఈ వృత్తిని విడిచిపెట్టారని యూనియన్ నాయకులు చెబుతున్నారు. అయినా ఇప్పటికీ ఆటో నడుపుతున్న వారు భారీ అప్పుల్లో కురుకుపోతున్నారు. వాహన రుణాలపై వడ్డీగా ప్రతి నెలా రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ చెల్లిస్తున్నారు.

ప్రభుత్వం తమ దుస్థితిని నిర్లక్ష్యం చేస్తోందని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పండుగల సమయంలో ఆర్థిక సహాయం పంపిణీ చేస్తుండగా, కానీ తెలంగాణలో మాత్రం ఆటో డ్రైవర్లు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు వాగ్దానం చేసిన సహాయంలో రూ. 1,000 కోట్లకు పైగా బాకీ ఉందని నాయకులు అంచనా వేస్తున్నారు. ఛార్జీల సవరణలు, సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం, రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌ల నియంత్రణతో సహా తక్షణ చర్యలు తీసుకోకపోతే రాష్ర్టవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతామని ఆటోడ్రైవర్లు హెచ్చరిస్తున్నారు.

ఒకప్పుడు ఎంతో మంది జీవనోపాధి వనరుగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు మనుగడ కోసం రోజువారీ పోరాటం చేయాల్సివస్తున్నది. ఆదాయాలు కుప్పకూలిపోవడం, అప్పులు పెరగడం, ఆత్మహత్యలు పెరగడంతో, తెలంగాణ ఆటో- డ్రైవర్లుగా తమ బతుకులు కునారిల్లాయని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఇప్పుడు చర్య తీసుకోవాలని వారు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.