calender_icon.png 7 October, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరుగడ్డ పులకించేనా?

07-10-2025 12:39:35 AM

-నేడు కుమ్రంభీం వర్ధంతి 

-జోడేఘాట్‌లో అధికారికంగా నిర్వహణ

-ఏటా వర్ధంతి రోజే ఆదివాసీలపై ప్రభుత్వాల ప్రేమ

-గ్రామాల అభివృద్ధిని పట్టించుకోని వైనం

-సౌకర్యాల లేమితో సతమతమవుతున్న ఆదివాసీలు

కుమ్రం భీం అసిఫాబాద్, అక్టోబర్ 6(విజయక్రాంతి): జల్, జంగిల్, జమీన్ నినాదంతో నిజాం నిరంకుశ పాలనపై ఎనలేని పోరాటం చేసిన కుమ్రంభీం ఆశయాలు నేటికి పూర్తిస్థాయిలో నెరవేరలేదు. ఏటా ఆర్భాటంగా వర్ధంతిని నిర్వహిస్తున్నా.. ఆదివాసి గిరిజన గ్రామాలు మాత్రం సమస్యలకు నిలయంగా మారాయి. ఆదివాసీలు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వాలు పథకాలను ప్రవేశపెట్టినా క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు. ఆదివాసి గిరిజనుల కోసం పోరాటం చేసి అసువులు బాసి చరిత్ర పుటల్లోకి ఎక్కిన భీమ్ పోరుగడ్డ జోడేఘాట్ అభివృద్ధికి నేర్చుకోవడం లేదు. కనీస సౌకర్యాలు కల్పించడంలోనూ అధికార యంత్రం, ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. 

నేడు పులకించనున్న పోరుగడ్డ

జల్, జంగల్ ,జమీన్ నినాదంతో నిజాం ప్రభుత్వంతో జరిపిన పోరాటంలో అసువులు బాసిన గిరిజనుల ముద్దుబిడ్డ కుమ్రం భీం అసువులు బాసి 85 సంవత్సరాలు కావస్తుంది. గిరిజనులు ఆరాధ్య దైవంగా భావించే భీమ్ వర్ధంతి సందర్భంగా మంగళవారం జోడెఘాట్‌లో ప్రభుత్వం అధికారికంగా వర్ధంతిని నిర్వహించనుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం ఐటిడిఏ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసింది. భీమ్ వర్ధంతికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్రలోని గడ్ చందూర్, రాజురా, చంద్రపూర్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి గిరిజనులు తరలివస్తారు. కుమ్రం భీంకు ఘనంగా నివాళులర్పిస్తారు. గిరిజన ఆదివాసి సాంప్రదాయ పద్ధతిలో వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

మౌలిక వసతులు కరువు

ఏటా భీమ్ వర్ధంతిని ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తున్నప్పటికీ అక్కడ మాత్రం మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించడంలో శ్రద్ధ చూపడం లేదు. 2014లో అప్పటి సీఎం కేసీఆర్ వర్ధంతికి వచ్చి జోడేఘాట్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చి మ్యూజియం కోసం దాదాపుగా 25 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. మ్యూజియం ఏర్పాటు చేసినప్పటికీ పర్యాటకుల కోసం కాటేజీలు, హోటల్ నిర్మిస్తామని ప్రకటించినా అవి పూర్తి కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం జోడేఘాట్ అభివృద్ధి కోసం పాటుపడతామని హామీ ఇచ్చింది. జోడిఘాట్‌లో హోటల్, కాటేజీ నిర్మాణానికి దాదాపు 5 కోట్ల కేటాయించారు. వాటి నిర్మాణానికి భూమి పూజ చేసినప్పటికీ పనులు ప్రారంభించకపోవడంతో గిరిజనులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జోడేఘాట్‌తోపాటు మరో 12 పోరు గ్రామాల్లోను సమస్యలు తీవ్రంగా నెలకొన్నాయి. కనీసం రోడ్డు సౌకర్యం కల్పించడంలోనూ విఫలమయ్యారన్న ఆరోపణలు లేకపోలేదు.

అమలుకాని గిరిజన చట్టాలు

ఆదివాసి గిరిజనులు నేటికీ వారి హక్కుల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో అత్యధికంగా ఏజెన్సీ ప్రాంతం ఉన్నప్పటికీ గిరిజనులు మాత్రం అభివృద్ధి దిశగా అడుగులు వేయడంలో వెనుకంచిలోనే ఉన్నారన్న వాదనలు లేకపోలేదు. ఆదివాసి భూముల రక్షణ కోసం 1/70 చట్టం నిజాం సర్కార్ తీసుకువచ్చినప్పటికీ ప్రభుత్వాలు ఆదివాసీల భూములను పట్టించుకోవడంలేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు గుట్టుచప్పుడు కాకుండా భూములను ఆక్రమించుకుంటున్నారు. వలసలు పెరగి భూములు ఆక్రమణకు గురవుతుండటంతో గిరిజనులు అడవి బాట పట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రకారం గిరిజనులకు అడవి భూమి, నీటిపై పూర్తి హక్కులు ఉన్నప్పటికీ నూతనంగా తీసుకువచ్చిన చట్టాలు వాటికి తూట్లు పొడుస్తున్నాయి. గిరిజనులకు ఎలాంటి భంగం కలిగించకుండా బిల్లు ప్రవేశపెట్టి హక్కులు కల్పిస్తామని ప్రభుత్వాలు చెప్పినప్పటికీ అమలు కాలేదు. దీంతోపాటు ఆదివాసీల రక్షణ కోసం తీసుకువచ్చిన జీవోలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకే 100 శాతం ఉద్యోగ అవకాశం కల్పించాల్సి ఉండగా సుప్రీంకోర్టు జీవో నంబర్ 3ను రద్దు చేయడంతో ఏజెన్సీలోని గిరిజనులకు 50 శాతం మించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉద్యోగాలలో ఏజెన్సీ నాన్ ఏజెన్సీకి సంబంధం లేకుండా గిరిజనేతరులను భర్తీ చేసింది.