07-10-2025 01:42:44 AM
14న ఓట్ల లెక్కింపు
హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయ క్రాంతి): హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక వచ్చే నెల 11న జరుగనుంది. బీహర్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న, కౌంటింగ్ 14వ తేదీన ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అ కాల మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని భర్తీ చేయడానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఉప ఎన్నిక నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఈవో ఆయన తెలిపారు. ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 13న షెడ్యూల్ వెలువడుతుందని, అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు.
నామినేషన్లకు చివరి తేదీ అక్టోబర్ 21, అక్టోబర్ 22న పరిశీలన, విత్ డ్రా చేసుకోవడానికి అక్టోబర్ 24 తేదీ నిర్ణయించినట్టు తెలిపారు. మొత్తం ఎన్నిక ప్రక్రియ నవంబర్ 16న పూర్తవుతుందని సీఈవో తెలిపారు. ఉప ఎన్నికలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు, వీవీ ప్యాట్ యంత్రాలను వినియోగించనున్నట్లు చెప్పా రు.
అవసరమైన యంత్రాలు ఇప్పటికే పరీక్షించి సిద్ధం చేశామని, పోలింగ్ సాఫీగా జరగేందుకు అన్ని సాంకేతిక, భద్రతా చర్యలు తీసుకున్నామని సీఈవో చెప్పారు. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని వెల్లడించారు. అభ్య ర్థులు, రాజకీయ పార్టీలు తమకు ఉన్న నేర నేపథ్య వివరాలను పత్రికలు, టీవీ, సోషల్ మీడియా ప్లాట్‌ప్లామ్ ద్వారా ప్రకటించాలని సూచించారు.
పకడ్బందీగా ఏర్పాట్లు: ఎన్నికల అధికారి ఆర్‌వి కర్ణన్
కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వి కర్ణన్ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ సీపీ సజ్జనార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా పరిధిలోని అన్ని రాజకీయ ప్రకటనలు, హోర్డింగులను తొలగిస్తున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉన్నారని, వారి కోసం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త ఓటర్ల నమోదు మరో పది రోజులు అవకాశం ఉన్నదని చెప్పారు.
ఎన్నికల నిర్వహణకు సుమారు రూ.6 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను నవంబర్ 14న యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
శాంతిభద్రతలే కర్తవ్యం: సీపీ సజ్జనార్
ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని సీపీ సజ్జనార్ తెలిపారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున, జిల్లా పరిధిలో లైసెన్స్ కలిగి ఉన్న తుపాకులను తక్షణమే సమీప పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని ఆయన ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై బైండోవర్ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తి షెడ్యూల్
* గెజిట్ నోటిఫికేషన్ విడుదల.. అక్టోబర్ 13
* నామినేషన్ల స్వీకరణ ప్రారంభం.. అక్టోబర్ 13
* నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ.. అక్టోబర్ 21
* నామినేషన్ల పరిశీలన.. అక్టోబర్ 22
* నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు.. అక్టోబర్ 24
* పోలింగ్ తేదీ.. నవంబర్ 11
* ఓట్ల లెక్కింపు.. నవంబర్ 14