09-08-2025 12:21:00 AM
కలెక్టర్ బి.యం సంతోష్
గద్వాల, ఆగస్టు 8 : జిల్లాలో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ఆదర్శవంతంగా నిలవాలని ఆకాంక్షిస్తూ, అవసరమైన వసతుల కోసం పూర్తిస్థాయి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో వయోవృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న అటల్ వయో అభివృద్ధి యోజన పథకం కింద మంజూరైన వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహించేందుకు అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది.
ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో జిల్లా మహిళా,శిశు మరియు వికలాంగుల సంక్షేమ అధికారిణి సునంద, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ జి. రమేష్ ల మధ్య జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ వయోవృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ఈ డే కేర్ సెంటర్ను ప్రతిష్టాత్మకంగా, ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించాలని సూచించారు.
వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించడమే కాకుండా మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందించే ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహిళ శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని సునంద, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోశాధికారి సంగాల అయ్యప్ప రెడ్డి, సభ్యులు విశ్రాంత జిల్లా లెప్రసి అధికారి మల్లికార్జున్, నెట్వర్క్ ఇంజనీర్ బండారి పాల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణపు పనుల్లో పురోగతి సాధించాలి
గద్వాల, ఆగస్టు 8 ( విజయక్రాంతి ) : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణపు పనుల్లో స్పష్టమైన పురోగతి సాధించేందుకు క్షేత్ర స్థాయిలో పనిచేయాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు ఇందిరమ్మ ఇండ్ల పురోగతి పై మున్సిపల్ ఎంపీడీవోలు, కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా సాధించిన ప్రగతిపై అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాకు మంజూరైన 7 వేల ఇందిరమ్మ గృహాల్లో ఇప్పటివరకు 1,078 బేస్మెంట్ దశకు,3,850 మార్క్ అవుట్ దశకు చేరుకున్నాయని తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి మంచి పురోగతి సాధించినప్పటికీ, అదే వేగాన్ని కొనసాగించి మరింత మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ,నర్సింగ రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస రావు, హౌసింగ్ డీ.ఈ. కాశీనాథ్, అన్ని మండలాల ఎంపిడిఒలు,మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.