3 April, 2026 | 4:59 AM

ఐదు నెలల్లోనే రాష్ట్ర చీకటిమయం

06-05-2024 02:01 AM

కామారెడ్డి, మే 5 (విజయక్రాంతి): ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం చీకటిమయమైందని బాన్సువాడ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి విమర్శించారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బోర్లం గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో పది సంవత్సరాల పాటు రాష్ట్రం వెలిగిపోయిందని, కాంగ్రెస్ నాయకులు ఐదు నెలల్లోనే చీకటిమయం చేశారని అన్నారు.

రైతుబంధు రావడం లేదని, కరెంటు ఇబ్బందులు తప్పడం లేదని, ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగడం లేదని, రెండు లక్షల రుణమాఫీ అమలు లేదని మండిపడ్డారు. ఇలాంటి పార్టీకి ఓట్లు వేస్తారా అని ప్రజలను అడిగారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని పోచారం శ్రీనివాస్ రెడ్డి  అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల బిల్లులు రూ.26 కోట్లు రావాల్సి ఉండగా ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులు ఇవ్వకుంటే లబ్ధిదారులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని, అప్పటికీ బిల్లులు ఇవ్వకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని అన్నారు. ఎంపీగా పోటీ చేస్తున్న గాలి అనిల్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో నాయకులు అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, దాసరి శ్రీనివాస్, నార్ల రవీందర్, గురు వినయ్, నార్ల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.