calender_icon.png 19 October, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం టెండర్లకు గడువు పెంపు

19-10-2025 01:09:37 AM

23 వరకు దరఖాస్తుల స్వీకరణ 

-ఇప్పటివరకు వచ్చినవి 85,363 

-ప్రభుత్వ ఖజానాకు రూ.2,560 కోట్ల మేర ఆదాయం

-శనివారం ఒక్కరోజే రూ.1,162 కోట్లు

హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,650 మద్యం షాపులకు దరఖాస్తుల గడువును ఈ నెల 23 వరకు పెంచుతూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గత ఉత్తర్వుల ప్రకారం శనివారం చివరి గడువు కాగా, ప్రభుత్వం ఫీజుల ద్వారా ఆశించిన రూ.3 వేల కోట్ల మేర ఆదాయం రాకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చిందని తెలిసింది. ఆదివారం సెలవు, సోమవారం దీపావళి తర్వాత మూడు రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనున్నది.

గత ఉత్తర్వుల ప్రకారం శనివారమే చివరిరోజు కావడంతో ఆశావహులు భారీగా కేంద్రాలకు పోటెత్తారు. ఈ ఒక్కరోజే 50 వేల దరఖాస్తులు వస్తాయని అబ్కారీశాఖ అంచనా వేయ గా, ఆ సంఖ్య 38,754కు చేరకుంది. ప్రభుత్వ ఖజానాకు రూ.1,162 కోట్ల మేర ఆదాయం వచ్చింది. అలాగే మొత్తంగా 85,363 దరఖాస్తులు అందగా, ప్రభుత్వ ఖజానాకు రూ.2,560 కోట్ల మేర ఆదాయం వచ్చింది. మొత్తం మద్యం షాపుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ (గౌడ్) సామాజిక వర్గాలకు అబ్కారీశాఖ రిజర్వేషన్ల పరంగా దుకాణాలను రిజర్వ్ చేసింది. మిగతా మద్యం దుకాణాలతో పోలిస్తే, రిజర్వ్ అయిన దుకాణాలకు తక్కువ సంఖ్యలోనే దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తున్నది.