calender_icon.png 19 October, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ కోటా సాధించే వరకు పోరు

19-10-2025 01:08:00 AM

-తెలంగాణ బీసీ బంద్ చరిత్రాత్మకం

-బంద్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

-బీసీ వాటాపై పాలకులకు బలమైన సంకేతాలు ఇచ్చాం

-రెండు, మూడు రోజుల్లో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం 

-తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ. ఆర్.కృష్ణయ్య 

ముషీరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): చట్ట సభల్లో బీసీ కోటా సాధించే వరకు తెగించి పోరాడుతామని బీసీ జాక్ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. తెలంగాణలో చేపట్టిన బీసీ బంద్ కార్యక్రమం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ జాక్ జేఏ సీ వైస్ చైర్మన్ విజిఆర్ నారగోని, కో-చైర్మన్ దాసు సురేష్, జాక్ మీడియా ఇన్‌చార్జ్జి గుజ్జ కృష్ణతో కలిసి ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. 

బంద్ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తం గా విజయవంతం అయ్యిందని తెలిపారు.  అన్ని పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చాయని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. స్కూల్స్, కాలేజ్ లు, ఆర్టీసీ , ఉద్యోగులు, 135 కులసంఘాలు, ప్రతి ఒక్కరు బీసీ బందులో స్వచ్ఛందంగా పాల్గొన్నారని తెలిపారు. బంద్ ద్వారా బీసీలకు వాటా దక్కాలని, న్యాయం చేయాలని పాలకులకు బలమైన సంకేతాలు ఇచ్చామన్నారు. బీసీల ఆకాంక్షల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరావాలని అన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు, చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం భవిష్యత్‌లో చేపట్టే కార్యక్రమాలను బీసీ జాక్ నిర్ణయం తీసుకొని ప్రకటిస్తామన్నారు. 

తెలంగాణ ఉద్యమం లాగా, సాగరహారం, మిలియన్ మార్చ్ లాంటి కార్యక్రమాలు తీసుకొని తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.  కార్యక్రమంలో బీసీ నేతలు భరత్ కుమార్, నీల వెంకటేష్ ముదిరాజ్, రాంకో టి, చెరుకు మణికంఠ, రామ్మూర్తి, రాజేందర్, మోడీ రాందేవ్, దత్త ముఖేష్, బడేసాబ్ తదితరులు పాల్గొన్నారు.